మహిళలను మోసం చేసిన బీజేపీ నీతా డిసౌజా

వతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మరోసారి బీజేపీ మహిళలను మోసం చేసిందని అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నీతా డిసౌజా విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని పెట్టిన బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్ధతు ఇచ్చిందని గుర్తుచేశారు. గతంలోనే కాంగ్రెస్‌ రాజ్యసభలో బిల్లు పెట్టిందనీ, లోక్‌సభలో మెజార్టీ లేకపోవడంతో బీజేపీని పదే పదే కోరినా ప్రవేశపెట్టలేదని తెలిపారు. పదేండ్ల తర్వాత బిల్లు పెట్టి జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ తర్వాత అని ఎందుకంటున్నారని ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లు కేవలం ఒక ప్రకటన మాత్రమేనని తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. 2034కు ముందు అమలు చేయడం సాధ్యం కాకుండా చేసి కొత్త పార్లమెంటులో మహిళలను మోసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.