రాజకీయాలకు నెలవుగా రాజ్‌భవన్‌ : కోలేటి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడాల్సిన గవర్నర్‌ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచే మెకానిజంగా మారిపోయిందనీ, రాజ్‌భవన్‌ రాజకీయాలకు నెలవుగా మారటం సరిగాదని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ ఆక్షేపించారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాలకతీతంగా, స్వతంత్రంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన రాజ్‌భవన్‌లు పార్టీల వ్యక్తులకు నెలవుగా మారాయని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను తోసిపుచ్చే అవకాశం గవర్నర్లకు లేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం తగదని సూచించారు. రాష్ట్ర మంత్రిమండలి సిఫారసు చేసిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులనే ఎమ్మెల్సీలుగా నియమించినప్పుడు లేని అభ్యంతరం తెలంగాణలోనే ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ నేపథ్యముందన్న సాకుతో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణల పేర్లను తిప్పి పంపడం బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాలను అదుపు చేసే సాధనంగా గవర్నర్‌ వ్యవస్థ మారాడాన్ని తప్పుబట్టారు. తక్షణమే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన నిర్ణయాన్ని పున:పరిశీలించి మంత్రి మండలి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థులను నామినేట్‌ చేయాలని కోరారు.