ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికెే టికెట్‌ ఇవ్వాలని.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకులు

– రెండు గంటలకు పైగా హల్‌ చల్‌..
నవతెలంగాణ-నర్సాపూర్‌
రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికెే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సాయంత్రం మెదక్‌ జిల్లా కొల్చారం మండలానికి చెందిన నలుగురు యువకులు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. ఎమ్మెల్యే వచ్చి నచ్చజెప్పడంతో దిగివచ్చారు. కొల్చారం మండలానికి చెందిన రవీందర్‌, శ్రీకాంత్‌, సురేష్‌ గౌడ్‌,, అన్వేష్‌.. నర్సాపూర్‌ పట్టణంలోని మెదక్‌ వెళ్లే మార్గంలోని షుగర్‌ ఫ్యాక్టరీ పక్కనున్న సెల్‌ టవర్‌ ఎక్కారు. ఎమ్మల్యే మదన్‌ రెడ్డికే టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చేంతవరకు టవర్‌ దిగమని సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ షేక్‌ లాల్‌ మదర్‌, ఎస్‌ఐ శివ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. కాగా, విషయం ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికి తెలియడంతో.. ఆయన రాత్రి 8 గంటల సమయంలో సంఘటనా స్థలానికి వచ్చి యువకులకు నచ్చజెప్పడంతో వారు సెల్‌ టవర్‌పై నుంచి కిందికి దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టికెట్‌ తనకే వస్తుందని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటువంటి పనులు ఎవరూ చేయొద్దని సూచించారు.