– 24 నియోజకవర్గాల్లో 36వేల మంది ఎంపిక
– 2, 5వ తేదీల్లో పంపిణీ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చివరి పేద వరకూ అందరికీ అందించడమే ప్రభుత్వ ఆశయమని పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మూడో విడతలో భాగంగా బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆన్‌లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆన్‌లైన్ లాటరీ ద్వారా డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24నియోజకవర్గాల్లో మూడో విడతలో 36,884 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ విడతలో వికలాంగులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడంతో వికలాంగులకు 1,843, ఎస్సీలకు 6,271, ఎస్టీలకు 2,215, ఇతరులకు 26,555 కేటాయించామన్నారు.
లోకల్ కోటాతో కలిపి మొత్తం 39,804 ఇండ్లను కేటాయించినట్టు తెలిపారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, మరో 30వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు. ఎంపికైన వారికి రెండు విడతల్లో వచ్చేనెల 2, 5వ తేదీల్లో ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. మూడో విడత ఇండ్ల కేటాయింపులో పారదర్శకత కోసం ఎన్‌ఐసీ సహకారంతో ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్దిదారుల ఎంపిక చేశామన్నారు.
మంత్రులు మహమూద్ అలీ, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమక్షంలో ఆన్‌లైన్ డ్రా కార్యక్రమం సాగింది. అలాగే హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, డీఆర్వో వెంకటాచారి, ఎన్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.