విద్యార్థుల హత్యలపై ఆగ్రహం

– మణిపూర్‌లోని బీజేపీ కార్యాలయానికి నిరసనకారుల నిప్పు
ఇంఫాల్‌: మణిపూర్‌లో విద్యార్థుల హత్యలపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిరసనగా ఆందోళనకారులు రాష్ట్రంలో ఒక బీజేపీ మండల కార్యాలయానికి నిప్పు పెట్టింది. ఇటీవల రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల హత్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి నిరసనగానే ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. తౌబాల్‌ జిల్లాలో ఉన్న కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని నిప్పు పెట్టారు. కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టి, ఆవరణలో నిలిపి ఉంచిన వాహనం అద్దాలను పగలగొట్టారు. నిరసనకారులు టైర్లను తగులబెట్టి, చెక్క దుంగలు, ఉపయోగించని విద్యుత్‌ స్తంభాలను ఉపయోగించి ఇండో-మయన్మార్‌ హైవేను అడ్డుకున్నారు. రాళ్లతో దాడికి దిగారు. అయితే, ఈ గుంపును చెదరగొట్టడానికి జిల్లా అధికారిక యంత్రాంగం రంగంలోకి దిగింది. టియర్‌ గ్యాస్‌ షెల్‌లు, మాక్‌ బాంబులు, లైవ్‌ బుల్లెట్‌లను ప్రయోగించింది. దీంతో అక్కడి పరిస్థితి తీవ్రంగా మారింది. జులై 6 నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులను చంపడాన్ని నిరసిస్తూ మంగళవారం రాత్రి భద్రతా సిబ్బంది, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీచార్జ్‌ చేశారు. నిరసనకారులలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. బుధవారం సైతం వందలాది మంది విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ నివాసం వైపు మార్చ్‌ నిర్వహించారు. అయితే, రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో సహా భద్రతా బలగాలు గుంపును చెదరగొట్టడానికి టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, పొగ బాంబులను ఉపయోగించాయి