– 6,843 మందికి సీట్ల కేటాయింపు
– నేటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రత్యేక విడతలో 6.843 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైస్ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు దోస్త్ ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. ఇంట్రా కాలేజీ, ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఒక ప్రకటనలో విడుదల చేశారు. దోస్త్ ప్రత్యేక విడతలో 7,040 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మంది, రెండో ప్రాధాన్యత ద్వారా 782 మంది విద్యార్థులు సీట్లు పొందారని తెలిపారు. తక్కువ వెబ్‌ఆప్షన్లు నమోదు చేయడం వల్ల 197 మంది సీట్లు పొందలేకపోయారని పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ శనివారం వరకు గడువుందని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు సీట్లు కోల్పోతారని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల మూడు వరకు దోస్త్ ఇంట్రా కాలేజీ విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. వచ్చేనెల నాలుగున సీట్లను కేటాయిస్తామని వివరించారు. కాలేజీల్లో సీట్లు ధ్రువీకరించుకున్న విద్యార్థులకే ఇంట్రా కాలేజీ విడతకు అర్హులని స్పష్టం చేశారు.