అక్టోబర్‌ 5న విజయ మెగా డెయిరీ ప్లాంట్‌ ప్రారంభం : మంత్రి తలసాని

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ విజయ డెయిరీకి చెందిన మెగా డెయిరీ ప్లాంట్‌ను అక్టోబర్‌ 5న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో విజయ డెయిరీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో డెయిరీ చైర్మెన్‌ సోమా భరత్‌ కుమార్‌ గుప్తా, పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆధార్‌ సిన్హా, డెయిరీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రావిర్యాల్‌లో రూ.250 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 నుంచి 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో మెగా డెయిరీ ని నిర్మించినట్లు వివరించారు. ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని కోరారు. విజయ డెయిరీ నేడు రూ. 800 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌కు చేరుకుందనీ, ఇది ఎంతో గర్వకారణన్నారు.