పిడుగు పడి నలుగురు మృతి

Four killed by lightning– ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షం
నవతెలంగాణ-జైనథ్‌, కోటపల్లి, వాంకిడి, మంగపేట
ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో శుక్రవారం వర్షంతోపాటు పిడుగులు పడటంతో నలుగురు ప్రాణం కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గూడ గ్రామానికి చెందిన భార్యాభర్తలు యాసిన్‌(38), అప్సాన వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములతో కూడి వర్షంతోపాటు పిడుగు పడింది. దీంతో యాసిన్‌ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే 108లో రిమ్స్‌కు తరలించారు. రెండు ఎడ్లు సైతం మృత్యువాత పడినట్టు గ్రామ సర్పంచ్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్‌ కౌలుకు తీసుకున్న పత్తి చేనులో పురుగులమందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వర్షంతోపాటు పిడుగు పడింది. దీంతో రవీందర్‌(25) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గ్రామస్తులు చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రవీందర్‌కు భార్య, తల్లి ఉన్నారు. కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలోని ఖేడేగాంకు చెందిన పద్మబాయి(32) పిడుగుపాటుకు చేనులోనే ప్రాణం కోల్పోయింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ పరిధిలోని బొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఈసం పవన్‌ కళ్యాణ్‌(24) గురువారం రాత్రి మొక్కజొన్న చేనుకు కాపలా వెళ్లాడు. అయితే, భారీ వర్షం పడటంతో పవన్‌ ఇంటికి బయలుదేరగా.. మధ్యలో పిడుగు పడటంతో మృతిచెందాడు.