విదేశాల్లో ఉపాధి అవకాశాలపై 4 నుంచి అవగాహన

–  కరీంనగర్‌, రామగుండం, మంచిర్యాలలో ఎన్‌రోల్‌మెంట్‌ : టామ్‌కామ్‌ సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యం కలిగిన నర్సులు, కార్మికులకు ఉపాధి అవకాశాలపై ఈనెల నాలుగు నుంచి అవగాహన కల్పించాలని తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) నిర్ణయించింది. అందులో భాగంగా యూఏఈ, ఆస్ట్రేలియా, మాల్దా, మారిషస్‌, జపాన్‌, జర్మనీల్లోని ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కరీంనగర్‌, రామగుండం, మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టామ్‌కామ్‌ సీఈవో డాక్టర్‌ ఈ విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల నాలుగున కరీంనగర్‌లో, ఐదున రామగుండంలో, ఆరున మంచిర్యాలలో నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, ఆర్హత గల అభ్యర్థులు రెజ్యూమ్‌, సంబంధిత డాక్యుమెంట్లతో ఈ డ్రైవ్‌కు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం షషష.్‌శీఎషశీఎ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను చూడాలనీ, లేదంటే 8247838789/ 7893566493/ 9849639539 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.