ఈ-మైనింగ్‌ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పట్నం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌ ఈ-మైనింగ్‌ మొబైల్‌ యాప్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ (డీఎంజీ), జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ) హైదరాబాద్‌ సంయుక్తంగా ఈ-మైనింగ్‌ యాప్‌ను అభివృద్ధి చేశాయని మహేందర్‌రెడ్డి చెప్పారు. గనులు, ఇసుక, ఖనిజ రవాణా, తనిఖీలు, అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ-చలాన్‌ పద్ధతితో జరిమానాలను ఆన్‌లైన్‌లో వసూలు చేసేందుకు వీలుంటుందన్నారు. దీంతో పారదర్శకత, వెంటనే రుసుము వసూలు చేయడానికి అనుమతులు ఇవ్వొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీఎంజీ కాత్యాయనీ దేవి తదితరులు పాల్గొన్నారు.