మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు..

– ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..
న్యూఢిల్లీ: ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కెనడా, ఇండియా మధ్య తీవ్ర వివాదానికి దారి తీశాయి. కెనడా ప్రధాని మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రేమయం ఉందని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు భారత్‌ కూడా గట్టిగానే స్పందిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కెనడాకు గట్టిగానే బదులిచ్చాడు. కెనడా చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య, దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జైశంకర్‌ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెనడా-ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులపై మీడియా ప్రశ్నలు అడిగింది. ”హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద నిర్ధిష్ట సమాచారం ఉంటే భారత పరిశీలించేందుకు సిద్ధంగా ఉందని, మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. కానీ కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కాదా..!” అని జైశంకర్‌ అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాలు చర్చించి, విభేదాలను పరిస్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెనడా ప్రభుత్వంతో భారత్‌ చాలా కాలంగా ఇబ్బందులు పడుతోందని, ఉగ్రవాదంపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణమని జైశంకర్‌ అన్నారు. భారత్‌ లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు కెనడాలో ఉన్నారని, వారిని అప్పగించాల్సిందిగా భారత్‌ కోరినప్పటికీ కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదని, భారత వ్యతిరేఖ శక్తులు తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నాయని జైశంకర్‌ ఫైర్‌ అయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మా దౌత్య కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు దౌత్యవేత్తలను బెదిరించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా సర్రే నగరంలో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ని గుర్తుతెలియని వ్యక్తులు గురుద్వారా వద్ద కాల్చేశారు. అయితే ఈ హత్యను భారత్‌ ఏజెంట్లే చేశారని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అక్కడి పార్లమెంట్‌ లో ఆరోపించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే, ఇందుకు ప్రతిగా భారత్‌ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్‌ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశంగశాఖ ధ్వజమెత్తింది.