14 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకెళ్తాం

– రాష్ట్ర ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండో పీఆర్సీ ప్రకటించాలనీ, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర నేతలు జె. వెంకటేష్‌, జె. కృష్ణారెడ్డి, జె. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 40 వేల మంది, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 90 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థ రద్దు చేస్తానన్న వాగ్దానం నేటికీ అమలు చేయలేదన్నారు. ఆరునెలలకోసారి రెన్యూవల్‌ కోసం తిప్పలు పడాల్సి వస్తోందని వాపోయారు. తక్కువ వేతనాలు, మరోవైపు పనిభారంతో వారు సతమతం అవుతున్నారని చెప్పారు. జీతాలూ 15వ తేదీ దాటినా ఇవ్వడం లేదన్నారు. ఈ కాలంలో అనేకమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలున్నాయని వివరించారు. ప్రతి నెలా ఐదో తేదీలోగా జీతాలివ్వాలనీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులిచ్చి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని విన్నవించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌ వర్కర్లకు ప్రాముఖ్యతనివ్వాలనీ, వారి సర్వీసు ఆధారంగా దశల వారీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటిలోగా సమాన పనికి – సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.10 లక్షలు ప్ర్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యం కల్పించాలనీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.