నవ తెలంగాణ- మహబూబ్ నగర్
ప్రధానమంత్రి మోడీ కి ఈ ప్రాంతం అంటే ద్వేషమని, మహబూబ్ నగర్ కు వస్తాడు పోతాడు కానీ ఈ ప్రాంతానికి చేసేది మాత్రం ఏమీ ఉండదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయోదా హామీ ఇచ్చి ముచ్చటగా మూడుసార్లు మోసం చేశారని… మళ్లీ ఈ ప్రాంత ప్రజలను వంచించేందుకు ఆయన మరోసారి వస్తున్నారని విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బీసీ వత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.1 లక్ష సాయానికి సంబంధించిన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు, మైనారిటీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.1 లక్ష సాయానికి సంబంధించిన చెక్కులను 23 మంది లబ్ధిదారులకు అందజేశారు.సందర్భంగా మంత్రి మంత్రి మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి అయినా బీసీలకు మోడీ చేసిందేమీ లేదని తెలిపారు. తాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి అభివద్ధి సంక్షేమం కోసం కష్టపడుతున్నామని… కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వస్తూ కులం మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్ పాషా, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీంద్రనాథ్, బీఆర్‌ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్ రెడ్డి, నవకాంత్, కౌన్సిలర్ అంజాద్,పాల్గొన్నారు.