‘లఖింపూర్‌’ దుస్సంఘటనకు వ్యతిరేకంగా

– రేపు నిరసన దినం
– ఎస్‌కేఎం, కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లఖింపూర్‌ దుస్సంఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈనెల 3న మంగళవారం నిరసన దినం పాటించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్‌ మగ్దుంభవన్‌లో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, టి. సాగర్‌, ప్రభాకర్‌, బిక్షపతి, జక్కుల వెంకయ్య, నాగిరెడ్డి, ప్రసాద్‌, బాలమల్లేష్‌, ప్రసాద్‌, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు బాలరాజ్‌, వెంకటేశ్వరరావు, సూర్యం, ప్రభు లింగం తదితరులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జాతీయ సంఘాల పిలుపులో భాగంగా లఖింపూర్‌ఖేరిలో రైతులు, విలేకరి మరణానికి కారణమైన అజరు కుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని కోరారు. ఆయన్ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించిన రైతులను వాహనాలతో తొక్కించి కిరాతకంగా హత్య చేసిన మంత్రి కుమారుడు అశీష్‌ మిశ్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. రైతాంగ ఉద్యమ సందర్భంగా మోడీ రైతులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. పంటల మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలనీ, రుణ విముక్తి చట్టం తేవాలనీ, కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం నెలకు రూ. 26వేలు ఇవ్వాలన్నారు. 57ఏండ్లు నిండిన వారందరికీ నెలకు పదివేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత, సామాజిక సేవల కోసం ప్రయివేటీకరణను రద్దు చేయాలన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి రోజుకు రూ. 600 వేతనం చెల్లించి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో త్వరితగతిన అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. కౌలు రైతులను గుర్తించి రుణార్హత కార్డులు ఇచ్చి వారికి బ్యాంకు రుణం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల విద్యుత్తు సరఫరా నికరంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ… జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆహార భద్రత సాధించడమే స్వామినాథన్‌కు నిజమైన నివాళి
పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని సాధించడంతోపాటు ఆహార భద్రతను సాధించటం ఒక్కటే డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌కు నిజమైన నివాళి అని ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆయన మరణం రైతులకు, సామాన్య ప్రజలందరికీ వ్యవసాయ దేశ అభివృద్ధికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు, రైతు ఆత్మహత్యలను నివారించేందుకు, పంటల దిగుబడి పెంచేందుకు ఆయన అహర్నిశలు పాటుపడ్డారని తెలిపారు. పంటలకు పెట్టే ఖర్చుకు అదనంగా 50శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించి అమలు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తద్వారా రైతు ఆత్మహత్యలు ఉండవంటూ 2006లోనే ఆయన కేంద్రానికి సూచించారని తెలిపారు. డాక్టర్‌ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.