– ఉండాల్సింది 40 మంది – ఉన్న సిబ్బంది 23 మంది
నవతెలంగాణ – బోనకల్
బోనకల్ పోలీస్ స్టేషన్‌ను సిబ్బంది కొరత వేధిస్తుంది. మొత్తం 40 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 23 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 23 మంది సిబ్బందిలో నలుగురు వివిధ పోలీస్ స్టేషన్లలో అటాచ్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కసారి ఫిర్యాదుల విచారణ కోసం గ్రామాలకు వెళ్ళటానికి ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు. మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 43, 400 జనాభా కలిగి ఉంది. పోలీస్ భాషలో ఈ మండలాన్ని రూట్లుగా విభజించారు. ఫ్రెండ్లీ పోలీస్ అమలు నుంచి పోలీస్ శాఖలో పనితీరే పూర్తిగా మారిపోయింది. బోనకల్ పోలీస్ స్టేషన్ కు వాస్తవంగా ఇద్దరు ఎస్‌ఐలు ఉండాలి. కానీ బోనకల్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు రాలేదు. ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఏఎస్‌ఐలు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా అందరూ విధులు నిర్వహిస్తున్నారు. 29 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా 23 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్సై మరో ఏఎస్‌ఐ 15 మంది కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సగం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఒకరు రైటర్ గా, మరొకరు రిసెప్షన్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు వాచర్లగా, ఇద్దరు కోర్టు విధులు, మరో ఇద్దరు బ్లూ కోల్ట్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న 23 మందిలో పదిమంది పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడానికే సరిపోతున్నారు. మిగిలింది ఇక 13 మంది మాత్రమే. ఈ 13 మందిలో మరో నలుగురు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అటాచ్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. వైరా, నేలకొండపల్లి, రఘునాధపాలెం, మధిర పోలీస్ స్టేషన్ల లో ఒక్కొక్కరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఇక మిగిలింది ఎస్సైతో కలిపి తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో కూడా అదనపు డ్యూటీ లతో ఒక్కొక్కసారి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. 22 గ్రామాలకు కేవలం 9 మంది విధులు ఎలా నిర్వహిస్తారో అర్థం కాని ప్రశ్న. రోజువారీ గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చిన సమయంలో క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లడానికి ఒక్కొక్కసారి సిబ్బంది లేకపోవడంతో రోజుల తరబడి ఉండవలసి వస్తుంది. దీనివలన ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది. కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటీవల కాలంలో గ్రామాలలో ఘర్షణలు తగ్గుముఖం పట్టడంతో ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అయితే ఎక్కువగా భూ వివాదాలు, భార్యాభర్తల వివాదాలు పై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ పై భారం కొంతమేర తగ్గింది. కానీ ఒక్కొక్కసారి ఐదారు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం సిబ్బంది కొరత వేధిస్తుంది. మూడు రోజుల క్రితం గోవిందాపురం ఎల్ గ్రామంలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ అక్కడకు వెళ్లడానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఎదురైంది. సమీప పోలీస్ స్టేషన్‌ల నుంచి పోలీస్ సిబ్బందిని తీసుకువచ్చి బందోబస్తు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా బోనకల్ పోలీస్ స్టేషన్లను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇది ఇలా ఉండగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. బోనకల్ మండలం రాజకీయ చైతన్యానికి గీటురాయిగా నిలుస్తుంది. ఎన్నికల సమయంలో అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.