– ప్రసార భారతి అధికారులు
న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రసారాలతో పాటు పబ్లిక్ సర్వీస్ కంటెంట్‌పై కాపీరైట్ వాదనలు చేయబోమని ప్రసార భారతి స్పష్టం చేసింది. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ విషయంలో యూట్యూబర్లకు కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు పంపిందన్న ఆరోపణలపై ప్రసార భారతి ఈ మేరకు స్పందించి ప్రకటనను విడుదల చేసింది. పార్లమెంటరీ ప్రసారాలు కాపీరైట్‌కు సంబంధించినవి కావనీ, ఇవి సులభంగా పొందగలిగేలా ఉండాలని రాజ్యసభ టీవీ ఎడిటర్, మాజీ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ గుర్‌దీప్ సింగ్ సప్పల్ వాదించారు. యూట్యూబర్లకు ప్రసార భారతి నోటీసులు పంపటం సరికాదని అన్నారు. అయితే, తామెప్పుడూ కాపీరైట్ నోటీసులు జారీ చేయలేదని ప్రసార భారతి అధికారులు నొక్కి చెప్పారు. ప్రజా సేవ సంబంధిత కంటెంట్‌కు కాపీరైట్‌తో సంబంధం ఉండదని వివరించారు. అయితే, ప్లాట్‌ఫామ్ అల్గారిథమ్ కారణంగా కొన్నిసార్లు కాపీరైట్ ఉల్లంఘన కేసులు స్వయంచాలకంగా ఉత్పన్నం అవుతాయని తెలిపారు. కాగా, ఈ విషయంలో ఒక అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ వెలువడకపోవటం గమనార్హం.