– టాస్క్ నిర్వహించిన ద.మ.రైల్వే
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా ”14 నిమిషాల అద్భుతం” పేరుతో దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వ హించింది. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం – సికింద్రా బాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ టాస్క్‌ను విజయవంతంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా 14 నిముషాల్లో వందేభారత్ రైలులోని అన్ని బోగీలను అక్కడి స్వచ్ఛ యుద్ధవీర్ పేరుతో పిలిచే కార్మికులు శుభ్రం చేశారు. 14 నిముషాలకు కౌంట్‌డౌన్ టైం పెట్టుకొని, యుద్ధప్రాతిపదకన స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించిన యుద్ధవీర్‌లను జీఎం అభినందించారు. దీనివల్ల రైలు ప్లాట్‌ఫాంపై వేచి ఉండే సమయం తగ్గి, ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఛాలెంజ్‌ను ఇకపై నిరంతరం వందేభారత్ రైళ్లలో చేపడతామన్నారు.