లాజిస్టిక్స్ లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈవీ ట్రయల్స్ ను ప్రారంభించిన జేఎస్ డబ్ల్యూ సిమెంట్

 JSW Cement starts EV trials to reduce carbon emissions in logistics– తయారీ కార్యకలాపాలలో ఈ వీ ట్రక్కులకు మారాలనే ప్రణాళిక తో ముందడుగు

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచంలోని మేటి గ్రీన్ సిమెంట్ కంపెనీల్లో ఒకటైన జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. లాజిస్టిక్ కార్యకలాపాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే యోచనలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువ గల జేఎస్ డబ్ల్యూ గ్రూపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిలాజ ఇంధనాల ఆధారంగా నడుస్తున్న వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ ట్రక్కు లను  తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈవీ ట్రయల్స్ చేస్తున్న అతి కొద్ది లాజిస్టిక్స్ కంపెనీల్లో జేఎస్ డబ్ల్యూ ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లోని తమ వాహన తయారీ కేంద్రాల్లో 5 ఈవీ ట్రక్కు లను తయారు చేయడంతో ఈ పైలట్ ప్రాజెక్టు కు జేఎస్ డబ్ల్యూ సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం, జేఎస్ డబ్ల్యూ సిమెంట్ సంస్థ  కర్బన ఉద్గార తీవ్రత ఒక టన్నుకు 173 కిలోలుగా ఉంది. ప్రపంచ సిమెంటు సెక్టార్ యెుక్క 590 కిలోలు/ టన్నుల సగటులో  ఇది 30 శాతంగా ఉంది. సస్టైనలిటిక్స్ ఈ ఎస్ జీ రిస్క్ రేటింగ్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన 140కి పైగా సంస్థ లను వెనక్కి నెట్టి జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రంపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా 150 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించొచ్చని జేఎస్ డబ్ల్యూ భావిస్తోంది. దీని విలువ, 6000 చెట్లు ఏడాది మొత్తంలో గ్రహించే కార్బన్ డయాక్సైడ్ కు సమానం. జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ప్రస్తుతం భారతదేశంలో సంవత్సరానికి 19 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వార్షిక సంవత్సరంలో మరో 2 మిలియన్ టన్నులను జోడించాలని ఆశిస్తోంది. దీంతోపాటు రానున్న 5 సంవత్సరాలలో 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించే కార్యకలాపాలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేస్తోంది.

ఈ సందర్బంగా జె ఎస్ డబ్ల్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిలేష్ నర్వేకర్ మాట్లాడుతూ…

“మా వ్యాపార కార్యకలాపాలలో స్థిరత్వం అనేది ప్రధాన అంశం. అత్యల్ప ఉద్గార తీవ్రతతో జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఇప్పటికే దాని డీకార్బనైజేషన్ కార్యక్రమాల ద్వారా ఈ రంగంలో ముందడుగు వేస్తుంది. మేము మా ఈఎస్జీ లక్ష్యాలను సాధించడానికి అనేక రంగాల్లో పని చేస్తున్నాము. ప్రస్తుతం కర్నాటక , ఆంధ్రప్రదేశ్‌లలో మా తయారీ కార్యకలాపాల మధ్య కొనసాగుతున్న ఈవీ ట్రక్స్ పైలట్ ప్రాజెక్ట్ మన భవిష్యత్తును మరింత పచ్చగా, ప్రయోజనకరంగా మార్చడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. ఈ పైలట్ ట్రయల్స్ విజయం ఆధారంగా, మేము భారతదేశంలోని మా సిమెంట్ కార్యకలాపాలలో ఈ ఈవీ ట్రక్కుల ఏకీకరణను స్కేల్ – అప్ చేస్తాము. జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ప్రస్తుత ఈవీ ట్రక్కులను మురుగప్ప గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. పైలట్ ప్రాజెక్ట్  విజయవంతంగా పూర్తయిన తర్వాత, కంపెనీ అన్ని తయారీ యూనిట్లలో తన ఇన్-బౌండ్, అవుట్-బౌండ్ లాజిస్టిక్స్ కార్యకలాపాలకు మద్దతుగా ఈవీ ట్రక్కులకు మారాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.