దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే

Black day across the country– లఖింపూర్‌ ఖేరీ హంతకులకు మోడీ రక్షణ : రైతులు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీలో రైతుల ఊచకోత జరిగి రెండేండ్లు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా రైతులు బ్లాక్‌ డేగా పాటించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), సీఐటీయూ సహా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వేలాది మంది ప్రజలు భాగస్వామ్యమయ్యారు. మారణకాండకు సూత్రధారి అయిన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ కాపాడుతున్నారని రైతు నాయకులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో మిశ్రా పేరు ఉన్నప్పటికీ, ఆయనపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని, ఆయనను మంత్రివర్గం నుండి తొలగించలేదని విమర్శించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రధాని సిద్ధంగా లేరని, దోషులందరినీ శిక్షించే వరకు సమ్మెను కొనసాగిస్తామని సమావేశంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు. అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి బహిష్కరించి జైలుకు పంపాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌ కిసాన్‌ మోర్చా నాయకులు తాజిందర్‌ సింగ్‌ విర్క్‌, పి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుల్దు సింగ్‌ మాన్సా, రమీందర్‌ సింగ్‌ పాటియాలా, మంజిత్‌ సింగ్‌ రారు, గుర్మిత్‌ సింగ్‌ మంగత్‌, హర్నెట్‌ సింగ్‌ మెహమా, జయప్రకాష్‌ నారాయణ్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, రైతు, కార్మిక వ్యతిరేక పాలనపై సంఘటిత పోరాటం చేయాలని సమావేశం పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు అస్సాం, బీహార్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, జార?ండ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. బహిరంగ సభలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జరిగిన ఆందోళనలో ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా పాల్గొన్నారు.