తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఏర్పాటు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆవిర్భవించింది. బుధవారం హైదరాబాద్‌లో ఎస్సీ,ఎస్టీ, బహుజన ఉపాధ్యాయ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అడిక్వసీ జీవో నెంబర్‌ రెండును అమలు చేయడం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఆ జీవోను రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందని విమర్శించారు. ఆ జీవో రద్దయ్యే వరకు నిరంతరం పోరాటాలు చేపడతామని అన్నారు. పీఆర్సీ కమిటీని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు ప్రకటించారు. బంగారు తెలంగాణలో మధ్యంతర భృతి (ఐఆర్‌) ఐదు శాతం ప్రకటించడం సరైంది కాదన్నారు. 22 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీటీఎఫ్‌ నేత కొమ్ము రమేష్‌, ఎస్సీ,ఎస్టీయూఎస్‌ నేతలు పెంట అంజయ్య, సత్యనారాయణ, టీటీసీ నాయకులు ఆశీర్వాదం, టీఎస్‌టీటీఎఫ్‌ నేత శర్మన్‌, టీఎస్సీఎస్టీయూఎస్‌ నాయకులు కిషన్‌నాయక్‌, టీటీఏ నాయకులు హరికృష్ణ, టీటీఎఫ్‌ నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.