– కంది పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
– పట్టాలిచ్చే వరకు పోరు ఆగదు
– తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నిలువ నీడలేని పేదలు వేసుకున్న గుడిసెల్ని కూల్చేసి నిర్బంధం ప్రయోగించడం అన్యాయమని ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని 615 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. పట్టాలివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశారు. పేదలు సాగిస్తున్న ఇండ్ల స్థలాల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు బుధవారం ఎస్.వీరయ్య, జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు భూ పోరాట క్షేత్రానికి వచ్చారు. గుడిసెలేసిన పేదల్ని కలిసి మద్దతు తెలిపారు. ఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం చేద్దామని, ప్రజా సంఘాలు, సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేదలు గుడిసెలేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేదలు నిలువ నీడ లేక అద్దె కొంపల్లో ఉంటూ కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.పేదలపై కేసులు పెట్టి జైల్లో పెడతామంటూ భయబ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. 615 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నాయకులు, పెత్తందారులు ఎకరాల కొద్దిగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రయివేట్ కార్యాలయాలు, భవనాలు నిర్మిస్తున్న పెద్దలపై ఎలాంటి చర్యలూ తీసుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పేదలేసుకున్న గుడిసెల్ని మాత్రం కూల్చేసి నిర్బంధాన్ని కొనసాగించడం దారుణమన్నారు.కంది మండలంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ఇతర మండలాలకు చెందిన వారికి ఇవ్వడం సరైంది కాదన్నారు. కందిలో నివాసముంటున్న పేదల్ని గుర్తించి ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. పేదలకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు తమ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వందలాది మంది పేదలు కంది తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇండ్ల స్థలాలి వ్వాలని అధికారుల్ని నిలదీశారు. వ్యక్తిగత దరఖాస్తుల్ని తహసీల్దార్‌కు అందజే శారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.రామచంద్రం, ఎం.నర్సింహులు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షు లు అతిమేల మాణిక్యం, నాయకులు కృష్ణ, రాజు, పేదలు పాల్గొన్నారు.