బీహార్‌ బాటలో ఒడిశా..!

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బాటలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నడుస్తున్నారు. బీహార్‌ లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయ టపెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం కుల గణన చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వెనక బడిన తరగతుల జనాభా గణనకు పూనుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా సర్వే చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఓబీసీ గణనపై తమ ప్రభుత్వం కమిట్‌ మెంట్‌ తో ఉందని బిజు జనతాదళ్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీహార్‌ ప్రభుత్వం కుల గణన సర్వే నివేదిక విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఆ సర్వే ప్రకారం.. బీహార్‌ లో 63 శాతం జనాభా ఓబీసీ, ఈబీసీలే ఉన్నారు. ఒడిశాలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక మిగతా రాష్ట్రాలపై సైతం కుల గణన చేయాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అసోంలో మాత్రం మైనార్టీల(ముస్లిం) జన గణనను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేపట్టారు.