గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా సింగరేణి

Singareni towards green hydrogen production– సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వండి : ఉన్నతాధికారులకు సీఎమ్‌డీ అదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌లోని విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్వహణకోసం గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌ నిర్ణయించారు. ప్రస్తుతం హైడ్రోజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌గా మార్చి, మరో కొత్త గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. బుధవారంనాడిక్కడి సింగరేణి భవన్‌లో ఆయన ఉన్నతాధికారులతో విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో సోలార్‌ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి కాలరీస్‌ రికార్డు సృష్టించిందనీ, ఇప్పుడు మరింత పర్యావరణ హిత ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సింగరేణి ఆధ్వర్యంలో 224 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. అయితే సంస్థ ఆధ్వర్యంలోని 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్ర వినియోగానికి అవసరమైన హైడ్రోజన్‌ను ఇకపై సోలార్‌ విద్యుత్‌ వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇవి అమల్లోకి వస్తే దేశంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడే తొలి పవర్‌ స్టేషన్‌గా సింగరేణికి ఘనత దక్కనుంది. సాధారణంగా హైడ్రోజన్‌ వాయువు ఉత్పత్తిని థర్మల్‌ విద్యుత్‌ వినియోగించి ఎలక్ట్రాలసిస్‌ రసాయనిక పద్ధతిలో ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో థర్మల్‌ విద్యుత్‌కు బదులు సోలార్‌ విద్యుత్‌ వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ ను ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’ అని పేర్కొంటారని వివరించారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు 600 మెగావాట్ల జనరేటర్లలో వేడిమిని తగ్గించడం కోసం శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. దీనికోసం ప్లాంట్‌ ఆవరణలోనే ఒక హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి దాదాపు 10 వేల క్యూబిక్‌ మీటర్ల హైడ్రోజన్‌ వాయువును ఈ ప్లాంట్‌ ఉత్పత్తి చేస్తున్నది. అయితే సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం పది మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడి నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రస్తుత హైడ్రోజన్‌ ప్లాంటుకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొదించాలని సూచించారు. రామగుండం రీజియన్‌లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సింగరేణిలో 170 మిలియన్‌ యూనిట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ద్వారా రు.108 కోట్లు ఆదా చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ డీ సత్యనారాయణరావు వివరించారు. సమావేశంలో డైరెక్టర్‌ సీటీసీ సంజరు కుమార్‌ సూర్‌, చీఫ్‌ ఓ అండ్‌ ఎమ్‌ జే.ఎన్‌.సింగ్‌, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర జనరల్‌ మేనేజర్‌ చినబసివిరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ (సోలార్‌) జానకిరామ్‌, చీఫ్‌ ఆఫ్‌ పవర్‌ ఎన్వీకేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.