– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దసరా పండుగ సెలవును ఈనెల 24న కాకుండా 23వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. దసరా మరుసటి రోజు ఈనెల 24న సాధారణ సెలవును ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈనెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవును ఈనెల 24న కాకుండా 23కు మార్చింది. రాష్ట్రంలో ఈనెల 23, 24 తేదీల్లో దసరా పండుగ సందర్భంగా సాధారణ సెలవులుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు ఈనెల 13 నుంచి 25 వరకు 13 రోజులుపాటు విద్యాశాఖ సెలవులిచ్చింది. జూనియర్ కళాశాలలకు ఈనెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈనెల 26 నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో తరగతులు పున:ప్రారంభమవుతాయి.