ఆసక్తిగా హెచ్‌సీఏ ఎన్నికలు!

Curiously HCA elections!– పోటీలో నిలువనున్న మూడు ప్యానల్స్‌?
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర జట్ల ఎంపికలో అవినీతి, నిధుల దుర్వినియోగం, అంతర్గత కుమ్ములాటలు, ఆఖరుకు అంబుడ్స్‌మన్‌ నియామకం సైతం వివాదాస్పదమై.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంటేనే క్రీడాకారుల్లో అసహ్యం వచ్చేసింది!. సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు హెచ్‌సీఏను నిరంతర సంక్షోభం నుంచి బయటపడేసేందుకు… బహుళ క్లబ్‌లు, విరుద్ధ ప్రయోజనాలు పొందిన వారిని ఎన్నికలకు దూరం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సీఈసీ వి.ఎస్‌ సంపత్‌ ఎన్నికల అధికారిగా అక్టోబర్‌ 20న హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లకు ఎన్నికలకు జరుగనున్నాయి. సుదీర్ఘ వివాదానికి తెరపడుతూ హెచ్‌సీఏలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో హెచ్‌సీఏపై పట్టు సాధించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటీలో మూడు ప్యానల్స్‌ : నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఈ నెల 4న ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌ జాబితాలో ఉన్న సభ్యులతో ఏకసభ్య కమిటీ, ఎన్నికల అధికారి కీలక సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితా సైతం విడుదల చేశారు. గత మూడు దశాబ్దాలుగా హెచ్‌సీఏను ఏలుతున్న ఆడ్మినిస్ట్రేటర్లు ఈ పర్యాయం ఎన్నికలకు దూరమయ్యారు. దీంతో హెచ్‌సీఏ అధికారం దక్కించుకుని.. అభివృద్ది ఏంటో చూపిస్తామని అధ్యక్ష రేసులో నిలిచిన ఓ వ్యక్తి నవతెలంగాణతో చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానల్స్‌ పోటీపడుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఓ జాతీయ క్రీడా సంఘం అడ్మినిస్ట్రేటర్‌ బరిలో నిలుస్తుండగా.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు ఇద్దరు తమ ప్యానల్స్‌ను పోటీలో నిలుపుతున్నారు. బీజేపీ నాయకుడైన ఓ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు తన ప్యానల్‌ను నిలుపుతున్నప్పటికీ.. అదే పార్టీలో కొనసాగుతున్న కొందరు హెచ్‌సీఏ సభ్యులు మాత్రం అతడికి మద్దతుగా నిలువటం లేదు. నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో.. ఈ మూడు ప్యానల్స్‌ త్వరలోనే తమ అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.