నేడు భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో మంత్రి కేటీఆర్‌ పర్యటన

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి :
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో సోమవారం బిఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌ (ఐడిఓసి)ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాల్టీ పరిధిలో రూ.114.65 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చడానికి రూ.17.50 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. తొర్రూరులో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించనున్నారు. భూపాలపల్లి, పరకాల, తొర్రూరులలో బహిరంగసభల్లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ సభలను విజయవంతం చేయడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం సభ సక్సెస్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది.
బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌ (ఐడిఓసి)కి చేరుకుంటారు. తొలుత ఐడిఓసిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించాక, సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నాం 2.30 గంటలకు పరకాల వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో హెలికాప్టర్‌లో రానున్నారు. పరకాల మున్సిపల్‌ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు మంత్రి కేటీఆర్‌ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్టణానికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతోపాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. 6.30 గంటలకు కొడకండ్లలో మిని టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా మంత్రి కేటీఆర్‌ హైద్రాబాద్‌కు తిరుగుప యనమవుతారు.
– సభల సక్సెస్‌పై నజర్‌
త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో జరగడం గమనార్హం. ఈ మూడు పట్టణాల్లో బహిరంగసభలను సక్సెస్‌ చేసి బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి ప్రజలు తమ నుండి చెక్కు చెదరకుండా బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమదైన శైలిలో ఏర్పాట్లు చేశారు. చేసిన అభివృద్ధిని, ఇచ్చిన హామిలను నెరవేర్చి ప్రజల్లో చెరగని ముద్ర వేయడానికి బిఆర్‌ఎస్‌ నాయకత్వం బహిరంగసభల ద్వారా ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలె గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ ఈనెల 6వ తేదీన పర్యటించి రూ.900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన విషయం విదితమే. తాజాగా భూపాలపల్లి, పరకాల, తొర్రూరు పర్యటనకు మంత్రి కేటీఆర్‌ రానుండడంతో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.