– 10 రోజులుగా సమ్మెబాటలో జిపి ఆపరేటర్లు
– ఉద్యోగ భద్రత,వేతనాలు పెంచాలని డిమాండ్
– జీపీ కార్యాలయాల్లో పెరుకపోతున్న ఫైళ్లు
– ఎన్నికల వేళ మా మొర ఆలకించాలని వేడుకోలు
నవతెలంగాణ-మల్హర్‌రావు
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం,సేవల్లో వేగం పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ-పంచాయతీలను తీసుకోవచ్చింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్ అపరేటర్లను నియమించింది. అయితే వారికి వేతనాలు పంచాయతీలే చెల్లించాలని చెప్పడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర అలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు పలు డిమాండ్లతో గత నెల 29 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో గ్రామాల్లో సేవలు ఎక్కడికక్కడ నిలిసిపోయాయి. ఇంటర్‌నెట్ ఆధారంగా పంచాయతీలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో 2014-15లో ఈ-పంచాయతీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డిపిఎం) తరువాత గ్రామాల్లో క్లస్టర్ల వారిగా కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్దతిలో క్వారీ సంస్థ ద్వారా నియమించింది.అపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘము పరిపాలన నిధుల కింద 10 శాతం కేటాయించింది. నెలకు రూ.8 వేలకు తగ్గకుండా చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జిల్లాలో డిపిఎంతోపాటు 25మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఆపరేటర్ 8 నుంచి 10 పంచాయతీల పనులు చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటకరిస్తున్నారు.ప్రభుత్వానికి కావా ల్సిన సమాచార నివేదికలను రూపొందించడం,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు,పల్లెప్రగతి, హరితహారం, జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి మార్పిడి,వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ, ఆసరా పింఛన్లు, ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ కార్పొరేషన్లు, దళిత, బిసి బంధు, పార్లమెంట్, అసెంబ్లీ,స్థానిక సంస్థల ఎన్నికల పనులు చేస్తున్నారు.ఈ-గ్రామ్ స్వరాజ్,ప్లాన్ ప్లస్, పిఏప్‌ఎంఎస్, ఆస్తుల జియో ట్యాగింగ్, లోకల్ గవర్నెర్స్, డైరెక్టరీ పంచాయతీ కార్యదర్శులు చేసే పనులన్నీ వెబ్సైట్ లో పొందు పరచడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వీరిని పర్య వేక్షించేందుకు జిల్లాకు ఒక్కరి చొప్పున డిపిఎంలను నియమిం చింది. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న వీరంతా చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు.సమస్యలు పరిస్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయింది.
డిమాండ్లు ఇవే….
– ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డీపీఎంకు మొదటి పిఆర్పీ ఇవ్వడంతోపాటు పెస్కెల్ చెల్లించాలి.
– మండల పరిషత్ పంచాయతీల్లో పనిచేస్తున్న ఈ-పంచాయతీ ఆపరేటర్లకు రూ.22 వేల వేతనం,ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలి.
– ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులు వర్తింపజేయాలి.
– మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
– ఎవరైన మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి.