– రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులందరికీ లక్ష వరకు రుణమాఫీ జాప్యం లేకుండా చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాగం హేమంతరావు, పశ్యపద్మ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణ మాఫీ సాధనకోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. నాలుగు విడతల్లో అమలు చేస్తామని ప్రకటించిందనీ, అయినా అమలు చేయలేదని పేర్కొన్నారు. దీంతో వడ్డీ భారం తడిసి మోపడవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 25 వేల వరకు పంట రుణాలు పొందిన వారికి మాత్రమే 2020లో మాఫీ చేసిందనీ, రూ. 50వేల వరకు రుణమాఫీ చేస్తామంటూ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం ప్రకటించి, కేవలం ఐదు శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ 45 రోజుల్లో చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని తెలిపారు.