
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : అభివృద్ధి పాలనకు మెచ్చి మంత్రి ప్రశాంత్ రెడ్డికే మా ఓట్లు వేస్తామని పేర్కొంటూ కుల సంఘాల సభ్యులు చేస్తున్న ఏకగ్రీవ తీర్మానాల పరంపర కొనసాగుతుంది. సోమవారం మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు, యాదవ, గంగపుత్ర, అంబేడ్కర్ మాల, బంజారా సంఘాల సభ్యులు బిఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం అభ్యర్థి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మా మద్దతు, మా ఓట్లు అని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, కోనాపూర్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు, మా గ్రామానికి చేసిన సేవలకు మద్దతుగా ఉంటామని పేర్కొంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మమ్మల్ని వారి కుటుంబ సభ్యులుగా భావించి ఆదరిస్తున్నందుకు తామంతా ప్రశాంత్ రెడ్డి వెంట వంద శాతం ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఆయా కుల సంఘాల సభ్యులు చేసుకున్న ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను జడ్పీటీసీ సభ్యురాలు రాధా రాజగౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానాలు చేసుకున్న కుల సంఘాల సభ్యులకు గ్రామ బిఆర్ఎస్ పార్టీ తరఫున జెడ్పిటిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయ్య దేవయ్య, ఎంపీటీసీ సభ్యుడు లకావత్ గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్, మండల ఉపాధ్యక్షులు టేకుల రాజు, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు లకావత్ సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉత్కం నర్సాగౌడ్, ఉపసర్పంచ్ టేకుల జలంధర్, పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, జలా రాజు, తదితరులు పాల్గొన్నారు.