– వాహనాల తనిఖీల్లో.. రూ.8 లక్షలు పట్టివేత
నవతెలంగాణ-వైరా/బోనకల్
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా రూ.8లక్షలు పట్టుబడిన ఘటన ఖమ్మం జిల్లా వైరా, బోనకల్లో సోమవారం చోటుచేసుకుంది. వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి గంటలోనే లక్షలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ఇమ్మణి రాజేశ్వరి తన వ్యవసాయ భూమికి సంబంధించిన నగదును రూ.5 లక్షలను తీసుకొని కారులో హైదరాబాద్ వెళుతుంది. వైరా రింగ్ రోడ్ సెంటర్లో ఎస్ఐ మేడా ప్రసాద్ వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న రూ.5 లక్షలను ఐటీ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. తన వ్యవసాయ భూమిలో పంటకు వచ్చిన నగదును హైదరాబాద్ తీసుకు వెళుతున్నానని తెలిపారు.
ఎస్ఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. బోనకల్లో చెక్ పోస్ట్ వద్ద రూ. 3 లక్షలు పట్టివేత బోనకల్ చెక్ పోస్ట్ వద్ద ఇరువురి వ్యక్తుల నుంచి రూ.3 లక్షలు పట్టుకున్నట్టు ఎస్ఐ బొల్లెద్దు సాయికుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ చెక్పోస్ట్ వద్ద రోజువారి తనిఖీల్లో భాగం గా సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ తని ఖీల్లో మండలంలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బోయినపల్లి సతీష్ వద్ద రూ.2లక్షలు, చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన చల్లా దశరథ వద్ద రూ.లక్ష దొరికినట్టు తెలిపారు. వీరు మోటార్ సైకిల్ మీద వెళుతుండగా తనిఖీలో పట్టుబడినట్టు చెప్పారు. ఈ నగదును ఖమ్మం ఇన్కమ్ టాక్స్ అధికారులకు పంపించామని తెలిపారు. ఆ డబ్బులకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపించి ఇన్ కమ్ టాక్స్ అధికారుల వద్ద నుంచి వారు ఆ డబ్బులను తెచ్చుకోవచ్చని తెలిపారు.