నగదు బదిలీ ఇవ్వకుంటే బీఆర్‌ఎస్‌ను ఓడిస్తాం

If money transfer is not given
We will defeat BRS– ప్రమాదాల్లో మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : జీఎంపీఎస్‌ ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ డిమాండ్‌
– పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌ ముట్టడి
– గేటుపైకి ఎక్కి లోపలికి వెళ్లిన గొల్లకుర్మలు సమస్యలను
– ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అసిస్టెంట్‌ డైరెక్టర్‌
– గొర్రెల పంపిణీకి సరిపడా నిధులివ్వాలి
– 50 ఏండ్లు దాటిన వారికి రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గొర్రెల పంపిణీకి సరిపడా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం (జీఎంపీఎస్‌) ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ డిమాండ్‌ చేశారు. గొల్లకురుమలకు నగదు బదిలీ ఇవ్వకుంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు గ్రామాల్లో ప్రచారం చేయనివ్వబోమనీ, ఎక్కడా తిరగనివ్వబోమని అన్నారు. నగదు బదిలీ ఇస్తే పరిస్థితిని అర్థం చేసుకుంటామన్నారు. జీఎంపీఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యలో ‘గొర్రెల పంపిణీకి సరిపడా నిధులు విడుదల చేసి నగదు బదిలీ చేయాలి’అని డిమాండ్‌ చేస్తూ పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌ను గొల్లకురుమలు ముట్టడించారు. ప్రదర్శనగా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డైరెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్దకు చేరుకుని డైరెక్టర్‌ బయటకి రావాలంటూ నినదించారు. అధికారులెవరూ రాకపోవ డంతో వారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసు కుని గేటుపైకి ఎక్కి లోపలికి వెళ్లారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసు లకు జీఎంపీఎస్‌ నాయకులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఉడుత రవీందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల, కురుమలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి అప్పులపాలు చేసిందని విమర్శించారు. గొర్రెల పంపిణీ వల్ల దళారులే లాభపడ్డారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,370 మంది గొల్లకురుమలతో డీడీలు కట్టించి ఇప్పటి వరకు 28 వేల మందికి మాత్రమే గొర్రెలను పంపిణీ చేశారని వివరించారు. ఐదు రోజుల కింద ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ డబ్బులతో కేవలం 3,800 మందికి మాత్రమే ఇవ్వొచ్చనీ, మిగిలిన 88 వేల మందికి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు ఇవ్వాలనీ, పార్టీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద సరిపడా నిధుల్లేకుండా ఎందుకు డీడీలు కట్టించుకున్నారని అడిగారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో గొర్రెలు వస్తాయా? రావా? అనే ఆందోళనలో గొల్లకురుమ లున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిగిలిన వారందరికీ సరిపడా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
దళారుల ప్రమేయం లేకుండా గొల్ల కురుమల అకౌంట్లలోకి నగదుబదిలీ చేయాలనీ, రాజకీయ జోక్యం లేకుండా డీడీలు కట్టిన వారికి ముందు పంపిణీ చేయాలని కోరారు. 50 ఏండ్లు దాటిన గొర్లకాపరులకు నెలకు రూ.ఐదు వేల పెన్షన్‌ ఇవ్వాలనీ, ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అన్ని గొర్లకూ ఇన్సూరెన్స్‌ చేయాలని సూచించారు. జీఎంపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్‌ మాట్లాడుతూ ఎంత మంది గొల్లకురుమలున్నారు, ఏటా ఎంత మందికి గొర్రెలు పంపిణీ చేస్తారో సంఘాల నాయకులతో చర్చిస్తే బాగుండేదని అన్నారు. ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. సమస్య వస్తే పిలిచి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం అమల్లో లోపాలు న్నాయనీ, వాటిని సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేశారు. డీడీలు కట్టిన ప్రతిఒక్కరికీ నగదు బదిలీ చేయాలని కోరారు.
డైరెక్టర్‌తో సమావేశం
ఏర్పాటు చేస్తాం : అసిస్టెంట్‌ డైరెక్టర్‌
పోలీసులు జోక్యం చేసుకుని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అందుబాటులో లేనందున ఆ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులును బయటికి తీసుకొచ్చారు. ఆయనకు జీఎంపీఎస్‌ నాయకులు వినతి పత్రం ఇప్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాజకీయ జోక్యం లేకుండా గొర్రెల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన అన్ని డిమాండ్లనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. డైరెక్టర్‌తో జీఎంపీఎస్‌ నాయకుల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని అన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హామీతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్‌ రాష్ట్ర నాయకులు ఎ శంకరయ్య, కె లింగయ్య, బి అశోక్‌, సాదం రమేష్‌, టి లింగయ్య, పి మధుకర్‌, కాల్ల సురేష్‌, పాలమూరు కురుమ సంఘం మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షులు మాదారం కృష్ణ, శ్రీకాంత్‌, ఓయూ విద్యార్థి నాయకులు కొంగల పాండు, గట్టయ్య, జీఎంపీఎస్‌ నాయకులు ఏ కొమురయ్య, దయ్యాల నర్సింహ్మ, దేవేందర్‌, మల్లయ్య, మహేష్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.