కాంగ్రెస్‌తో కుదిరిన రాజకీయ అవగాహన

A political understanding with the Congress– ఇంకా ఖరారు కాని సీట్లు
– ఎన్నికలకు ఆర్నెల్ల ముందే కొత్త పథకాలు అమలు చేయాలి
– అధికారుల బదిలీల పేరుతో తాబేదార్ల నియామకం
– ఎన్నికల కమిషన్‌కు లేఖ : సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరిందని, ఇంకా సీట్లు ఖరారు కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలు నమ్మొద్దని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు ఆశాజనకంగా ఉన్నాయనీ, అవి పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ, సీపీఐ(ఎం) చెరో ఐదు సీట్లు కావాలంటూ కాంగ్రెస్‌కు జాబితా అందజేశామని అన్నారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో చర్చించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ సీపీఐ, సీపీఐ(ఎం)లతో కాంగ్రెస్‌ విడివిడిగా చర్చలు జరిపిందన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదించిన స్థానాల్లో ఎలాంటి వివాదం లేదనీ, రెండు పార్టీలనూ కలిపి చర్చలు జరిపితే బాగుండేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోనే కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసే ఉన్నాయని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల్లో కలిసి, సర్దుబాటు కుదరకపోతే విభేదించుకుని పోటీ చేస్తున్నామని చెప్పారు. కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆయా రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటిగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఛత్తీస్‌ఘడ్‌ బస్తర్‌ ప్రాంతంలో సీపీఐ ఏడు, ఇతర ప్రాంతాల్లో ఏడు కలిపి 14 చోట్ల పోటీ చేస్తున్నదని వివరించారు. సీపీఐ(ఎం), సీపీఐ కలిసి 40 నుంచి 45 స్థానాలలో పోటీ చేస్తున్నాయని అన్నారు. మధ్యప్రదేశ్‌లో సీపీఐ 15, సీపీఐ(ఎం) 14 స్థానాలలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయని చెప్పారు. రాజస్థాన్‌లో సీపీఐ 14, సీపీఐ(ఎం) 15 స్థానాలలో పోటీ చేస్తున్నాయని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన ఉందని నారాయణ స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వకంగా అధికారుల బదిలీలు చేయొద్దు
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి రెండునెలల ముందు అధికారులను బదిలీ చేస్తున్నారని నారాయణ చెప్పారు. అయితే అధికార పార్టీకి తాబేదార్లుగా ఉండే వారిని నియమించుకుంటున్నారని విమర్శించారు. పోలీసు, రెవెన్యూ అధికారులంతా పాలకులు చెప్తే వినేవారిని పెట్టుకుంటున్నారనీ, తద్వారా రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకుంటున్నారని అన్నారు.
దాని బదులు ప్రయివేటు గ్యాంగ్‌ను పెట్టుకోవచ్చుకదా?అని విమర్శించారు. బౌన్సర్లను నియమించుకుంటే బాగుంటుంది కదా?అని అన్నారు. అధికార పార్టీకి ఉపయోగపడేలా బదిలీలు చేయడం అధికారులకే అవమానకరమని చెప్పారు. ఎన్నికల హామీలు, కొత్త పథకాలను ఆర్నెల్ల ముందే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
దళితబంధు, రైతుబంధు వంటివి ఎన్నికల ముందు ప్రారంభించడం, పోలింగ్‌ సమయంలో ఓటర్ల ఖాతాల్లో నిధులు జమ కావడం అధికార దుర్వినియోగం కాదా?అని ప్రశ్నించారు. ఇది అవినీతి కిందకు రాదా?అని అడిగారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. అధికార దుర్వినియోగం పాల్పడేందుకు అవకాశం లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కు అయినట్టు భావించాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు నారాయణ మంగళవారం లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, ఈటి నరసింహా తదితరులు పాల్గొన్నారు.