కృష్ణా నీటి వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తిపై వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలి

Krishna should file a counter on water consumption and electricity generation in a week– కేంద్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీలకు సుప్రీం ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా నదీ నీటి వినియోగం, పవర్‌ జనరేషన్‌(విద్యుదుత్పత్తి) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రిజాయిండర్‌ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి మరో రెండు వారాల సమయం ఇచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ… 2021లో ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. కృష్ణా నదీ నీటి వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటి విడుదల ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ లో పేర్కొంది. ఈ పిటిషన్‌ మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఈ పిటిషన్‌ కు సంబంధించి ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసినట్టు తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కోర్టుకు నివేదించారు. ఇదే అంశంపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ… వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేస్తామని, ఇందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ద్విసభ్య ధర్మాసనం… ఏడు రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.