ఎలక్ట్రిక్‌ బస్సుల్ని త్వరగా ఇవ్వండి

Give electric buses as soon as possible– హర్యానాలో తయారవుతున్న బస్సుల్ని పరిశీలించిన టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో3
ప్రజారవాణాను మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి త్వరగా ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అందించాలని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కోరారు. బుధవారంనాడాయన హర్యానాలోని పల్వాల్‌లో జేబీఎమ్‌ గ్రూప్‌ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సుల యూనిట్‌ను సందర్శించారు. జేబీఎమ్‌ గ్రూప్‌ టీఎస్‌ఆర్టీసీకి 500 బస్సుల్ని అందించేలా ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి బస్‌ బాడీ యూనిట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్‌ సందర్శించారు. ప్రస్తుతం విజయవాడ మార్గంలో పది ఎలక్ట్రిక్‌ బస్సుల్ని టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్నది. మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తే వాటిని దూర ప్రాంతాలకు తిప్పుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సంస్థ తరఫున ఇప్పటి వరకు 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. వీటిలో కొన్ని బస్సుల్ని డిసెంబర్‌నాటికి అందిస్తామని జేబీఎం గ్రూప్‌ హెడ్‌ సేల్స్‌(నార్త్‌) ముఖేశ్‌ శర్మ, జీఎం ఆపరేషన్స్‌ ప్రశాంత్‌ శర్మ తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఈ సందర్భంగా ఎమ్‌డీ వారికి సూచించారు. నూతన ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు, భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి, నివారించేందుకు ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్సు రివర్స్‌ చేసేందుకు పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా, బస్సు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్‌డీ సజ్జనార్‌ వివరించారు. హర్యానా వెళ్లిన వారిలో టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌, సికింద్రాబాద్‌ డిప్యూటీ ఆర్‌ఎం భీంరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌(ప్రాజెక్ట్స్‌) భాను ప్రసాద్‌, జేబీఎం గ్రూప్‌ ప్రతినిధులు నిఖిల్‌ ఓజా, అమిత్‌ వర్మ, మనోహర్‌ లాల్‌ తదితరులు ఉన్నారు.