– భార్య కండ్లముందే భర్త మరణం
– శోకసముద్రంలో కుటుంబసభ్యులు
నవతెలంగాణ-జవహర్ నగర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో ఓ చెరువులో స్నానానికెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ బార్షపేట చెరువులో గురువారం జరిగింది. దర్గాలో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ లంగర్‌హౌజ్ నుంచి వచ్చి ప్రాణం కోల్పోయారు. ఎస్‌హెచ్‌ఓ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన సలీం(30), ఫర్వీజ్(17) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. కౌకూర్ దర్గాలో బుధవారం ఉర్సు పండుగను పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గురువారం ఉదయం అందరూ కలిసి కౌకూర్ బార్షపేట చెరువులో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే చెరువు లోపలికి దిగిన సలీం, ఫర్వీజ్‌కు లోతు తెలియక ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. సలీంకు భార్య సుల్తానా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కండ్ల ముందే భర్త మరణించడంతో సుల్తానా గుండెలవిసేలా రోదిస్తోంది. ఫర్వీజ్ అదే కాలనీలో నివాసముంటున్నాడు.