తమిళనాడుకు నీటి విడుదల కొనసాగించండి

– కర్నాటకకు కావేరి కమిటీ ఆదేశం
– అప్పీలు చేస్తామన్న డిప్యూటీ సీఎం శివకుమార్‌
న్యూఢిల్లీ : తమిళనాడుకు ఈ నెల 16 నుండి 31వ తేదీ వరకూ ప్రతి రోజూ మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ కర్నాటకను ఆదేశించింది. అయితే దీనిపై అప్పీలుకు వెళతామని, రైతుల ప్రయోజనాలు కాపాడతామని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు.
అక్టోబర్‌ 15వ తేదీ వరకూ రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని గత నెలలో కర్నాటకను కమిటీ ఆదేశించింది. రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని అందించాలంటూ తమిళనాడు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ నెల 10వ తేదీ వరకూ తమ రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని కమిటీకి కర్నాటక తెలియజేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తమిళనాడు రాబోయే పదిహేను రోజులు 16 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కర్నాటకను కోరింది. కావేరీ జలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఈనాటిది కాదు. ఒకప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ, మైసూర్‌ రాష్ట్రాల మధ్య 1892, 1924 సంవత్సరాల్లో ఒప్పందాలు కుదిరాయి.
అప్పటి నుండీ కర్నాటక, తమిళనాడు మధ్య వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై కేంద్రం 1990లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ 2007లో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ రెండు రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ తీర్పు అమలు కోసం కావేరీ జల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలని 2018 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.