పోటీపరీక్షల వాయిదాకు కేసీఆరే కారణం

– ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు బొందపెట్టాలి : ఏఐఎస్‌ఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ విమర్శించారు. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికల కోడ్‌ ఉంటుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. పోటీ పరీక్షల వాయిదాకు సీఎం కేసీఆర్‌ వైఖరే కారణమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్‌-1 రద్దు, గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు ఇప్పుడు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. తొమ్మిదేండ్లుగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరినా పట్టించుకోకుండా ఎన్నికల ముందు తక్కువ పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేశారని తెలిపారు. ఉద్యోగ నియామకాల పట్ల కేసీఆర్‌ వ్యవహరించిన తీరును ఇప్పటికైనా నిరుద్యోగులు గుర్తించాలని కోరారు. ఎన్నికల కోసం ఏడాది ముందు నుంచి సన్నద్ధమయే సీఎం కోడ్‌ రాకముందు నియామకాల ప్రక్రియను సక్రమంగా చేపట్టాలన్న శ్రద్ధ లేకపోవడం నిరుద్యోగులంటే ఎంత వివక్ష ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టడానికి నిరుద్యోగులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.