న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దత్తతను మానవతా విషయంగా అభివర్ణించిన న్యాయస్థానం మెరుగైన జీవితం కోసం ఎంతో మంది చిన్నారులు వేచిచూస్తున్నారని పేర్కొంది. దత్తత స్వీకరణ, ప్రక్రియ సరళీకరణపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది.దేశంలో చిన్నారుల దత్తత ప్రక్రియ నిలిచిపోయిందని ఒక పిటిషన్, ఈ ప్రక్రియను సరళీకరించాలని కోరుతూ మరోక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. దత్తత ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘దత్తత ప్రక్రియను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సిఎఆర్‌ఎ) ఎందుకు నిలిపివేస్తున్నారు? ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టడం లేదు. మెరుగైన జీవితం కోసం వందలాది మంది చిన్నారులు దత్తత కోసం వేచిచూస్తున్నారు’ అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. గత మూడేళ్లలో దత్తత కోసం వేచి చూస్తున్న పిల్లలు, దత్తత పూర్తైన వారి సంఖ్యను తెలియజేయాలని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు.దీనిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ ప్రయత్నించారు. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ధర్మాసనం ముందు ఉంచడానికి అనుమతి కోరారు. అయితే దీనిపై ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ సిఎఆర్‌ఎ దత్తత ప్రక్రియను అనుమతించడం లేదని తమకు తెలిసిందని పేర్కొంది. దత్తత తీసుకునేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని, వాళ్లలో ఎక్కువ మంది మంచివాళ్లే ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై సిఎఆర్‌ఎతో చర్చించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ న ఎల 30కి వాయిదా వేసింది.