ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం
 నవతెలంగాణ-గంగాధర : విద్యార్థిని ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆరోపించారు. విద్యార్థుల కలలను  బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లలు చేస్తుండగా, టీఎస్పీఎస్సీ అవినీతి అక్రమాలకు చిరునామాగా మారిందన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యం మాట్లాడారు. యుపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ని నిర్వహించాలని అన్నారు. హైదరాబాదులో గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ప్రవళికది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని అన్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి కూడా  డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగ పరీక్షలు నిర్వహించకుండా  ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిందన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే నేడు ఉద్యోగాల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నీళ్లు, నిధులు నియామకాల్లో తెలంగాణాకు జరిగిన అన్యాయం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టిరాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా ఉద్యోగ పరీక్షలు వాయిదా వేసి నిరుద్యోగుల ఆశలను  సీఎం కేసీఆర్ నీరుగార్చారని మండి పడ్డారు. టీఎస్పీఎస్సీ అక్రమాలకు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది, ఏ పరీక్షను సరిగా నిర్వహించకుండా టీఎస్పీఎస్సీ సభ్యుల వ్యవహరించడం బాధాకరం అన్నారు. యూపీఎస్సీ తరహాలో టిఎస్పిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. యూపీఎస్సీ తరహాలో  నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అదైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు, బోయినిపల్లి మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, వన్నెల రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు వీరేశం, సుదీర్, తదితరులు పాల్గొన్నారు.