సినారె ‘దృక్పథం’…

Sinare's 'perspective'...మనిషి కొండగుహల నుండి మణికాంతుల మహలుకు వచ్చిన శ్రమజీవి. సంఘజీవి. జ్ఞానాన్వేషణలో ఎన్నో అవసరమైన వస్తువుల్ని అద్భుతమైన విషయాల్ని కనుగొని పరిణితి చెందాడు. అనేక విధాలుగా ఆనందానుభూతిని అనుభవించాడు. మనిషి ఆలోచన మోదంగాను, సమూహ ఆమోదంగాను, ఒక్కోసారి ప్రతికూలంగాను ఉండవచ్చు. కానీ మనిషి మనిషిగా మనగల్గాలంటే మాత్రం ‘సానుకూల దృక్పథం’ అనివార్యం. ఎంతో శక్తివంతమైన మానవుడి మేధస్సు ఈ ‘దృక్పథం’ ఇరుసుపైనే తిరుగుతుందనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అసలు దృక్పథమంటే ”ఒక నిర్దిష్ట పరిస్థితిని లేదా వస్తువుని విశ్లేషించడం అని అర్థం.
డా.సి.నా.రె 29 జూలై1994 తన జన్మదినం సందర్భంగా ఆవిష్కరించిన ఈ కవితా సంపుటి పేరు ‘దృక్పథం’. శీర్షికకు తగ్గట్టు సినారె తన అపార అనుభవంతో 48 కవితల్ని అందంగా మలిచి అందించారు మనకు. ఈ కవితలన్నింటిని చదివితే ఈ సంపుటికి ‘దృక్పథం’ అనే శీర్షిక పూర్తిగా సమంజసమని మన మనసుకు అర్థమవుతుంది.
కవితాసంపుటి నిండా వస్తు, శైలిల దృష్ట్యా విలక్షణతతో బాటు నవ్యత్వం కనిపిస్తుంది. భాష సరళంగాను, భావం లోతుగాను, అందంగా వ్యక్తమవుతుంది. వెరసి కవితాపొత్తం మనిషికి జీవితంపట్ల నూతన ప్రేరణను, ఉత్సాహాన్ని, కొత్త చూపుని, సరిక్రొత్త దృక్పథాన్ని అందిస్తాయి.
కదిలితేనే … కవితలో
”నిలిచిపో ఈ గట్టు మీదనే/ నీలో సముద్రాలు ఇంకిపోయే వరకు/ ఒంటి పై ఊరిపోతున్న ఆ ఉప్పు/ సత్యాగ్రహంలా ఉరిమి నిప్పులూదేవరక”ంటూ ఎంతో గంభీర స్వరంగా పలుకుతాడు సినారె. నిలకడంటే స్తబ్దతా కాదు వేళ్లగునపాలతో రాళ్ల బొచ్చలు ఛేదించుకు వచ్చే నిటారుగా నిలిచిన వృక్షకాండంమని అంటాడు.
”పక్షి చిన్నదైతే మాత్రం ఏమి/ విశ్వంభరం ఉరం మీద
ధరణి మూల్గులు మబ్బులు దాకా మోసుకెళ్తుందని”
పక్షిని, అనంత విశ్వంభరను, ఆకాశాన్ని తను చూచిన చూపును మనకందించాడు సినారె. ”కదిలితేనే కదా జగతికి అస్తిత్వం/ కరిగితేనే కవికి వ్యక్తిత్వం” అంటూ కవిత ముగింపుతో మనల్ని పతాకస్థాయికి తీసుకెళ్తాడు.
భావంలో గాఢత, పదాల సరళతకు ఈ కవితే ఒకఉదాహరణ. కదలికనే ముఖ్యం పక్షికైనా, మబ్బుకైనా, మనిషికైనా అని మనల్ని కదిలిస్తాడు కవి. నీ ముందర, చుట్టూ, నీలోపల కలిగే బాధలకు కరగడమే కవి లక్షణమని లోతైన భావాన్ని ఈ కవితలో స్పృశించాడు. కవిత్వం రాయడమంటే మన చుట్టూ ఉండేబాధలు, మనలో కలిగే గాయాలకు అక్షరరూపం కదా.
వీరి శిష్యులు డా||నందినీ సిధారెడ్డి గారన్నట్లు కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక అనేది యదార్థం.
దృక్పథం కవితలో …..
”ముళ్లకంపలో ఇరుక్కుపోయిన చూపు/ ఒళ్లంతా గీరుకుపోయినా రక్తం రాలదు/ పదును మొనల ఆలోచనలు” రాలుతుంటాయంటాడు.
”మట్టి శిశువు మొలకనోరు విప్పితే/ చెట్టంత ఎదిగిన మనిషి భాష వింటుంది చూపు/ సమస్త చైతన్య సారథ్య హేతువు చూపు/ సృష్టికి పథ ప్రతిష్ట చేసే ప్రాణధాతువు చూపు”. కవి మట్టిని శిశువుగా, అందులోంచి ఆవిర్భవించిన లేమొలకను నోరుగా ఉపమానం చేయడం గొప్పవిషయం.
చెట్టంత ఎదిగిన మనిషిభాష చూపు వింటుందనడం ఇంకా గొప్ప ఊహ. చైతన్యానికి ప్రధాన కారణం చూపని, ఈ సమస్త సృష్టికి దారిదీపం, ప్రాణధాతువు చూపని ఈకవిత ‘చూపు’ యొక్క విశ్వరూపంగా భావించగలం.
పక్షుల బొమ్మలు…
”అచ్చు పుస్తకంలోంచి పక్షుల బొమ్మలు/ అలా ఎగిరిపోతాయనుకోలేదు/ అవి బొమ్మలయితే కదా!” అని కవిత్వీకరించడం సినారె పాకతమైన మనసుకు, ప్రేమకు నిదర్శనం. ఇదే కవితలో పక్షులు ఎంతోసేపు పడుకోవు అక్షరాల్లాగే అనడం కవిత్వం కువకువలై ధ్వనిస్తుంది.
”పక్షులు సెలయేళ్లకు గళదానం చేయందే నిలవలేవు/ విడాకుల ముఖంపెట్టిన ఉభయసంధ్యల మధ్య/ కొడిగట్టిన దూరాలను తుడిచేయందే వాటికి/ గూళ్లు గుర్తు రావు” అంటూ ఎంతో హృద్యంగా కవి కట్టాడు. ముక్తాయింపుగా కాసేపు పక్షులు బొమ్మలుగా మారితేనే ఈ కృత్రిమ జీవిత కలుషిత శ్వాసలకు ఎంత శుభ్రత అనడం.. కవి లోలోపల ఎంతో ఆవేదనకు గురైతే తప్ప ఈ పంక్తులు కాగితం పై దొర్లవు.
మాతక కవితలో…..
”శవం చావదు/ మట్టై బతుకుతుంది
మొదటి వాక్యం సాధారణం. కానీ రెండో వాక్యం కవిలోని మార్మిక అనుభవాన్ని అక్షరాల పేర్చి చదువరిని చలింప చేస్తుంది. సినారె భావగాఢతను పాఠకుని మనసులో ముద్ర వేస్తుంది.
”మనిషి అంటని చోటికి….
కాంక్రీటు సుఖాల్లో పాతుకుపోయిన హృదయం/ పొడిమట్టి తాకిడిలో పువ్వై విరబూసింది”
అదే కవితలో
”ఇక్కడి నేలవేరు/ ఇక్కడ పెరిగే బతుకు చెట్టుకు/ స్వచ్ఛమైన శీలం తల్లి వేరని…” మనిషి ఆకాశం ఎత్తుకు ఎదిగినా శీలాన్ని వీడరాదని కవి మనకు ఉద్భోస్తాడు.
డప్పుడొక్కలో….కవితలో
”తారుబాంబులు విసిరితే సూరీడు నల్లబడడు/ ముడుచుకుపోయే తూర్పు బల్లెం మొనమీద పడమరనిలబడదు.
దూర్త వేషాల అట్టహాసాల దుష్ప్రదర్శనల మధ్య/ ఉచ్చిలి దౌర్జన్యం గెలిచినట్టు ఒండ్ర పెట్టినా/ తుదిగెలుపు లేగదూడలది/ మూగవాడలది/ మోగే డప్పులది/ మూల్గే నిప్పులది”
ప్రపంచంలో, దేశంలో పెట్రేగుతున్న విద్వేషాలు, వింతపోకడలు ఇంకెంతకాలం? ఎంతకాలమో అవి మనజాలవు. సాదుగుణం, ప్రేమమయ మనసులదే తుదిగెలుపని కవి ఎలుగెత్తి ఆనాడే మనకు చాటాడు.
రోడ్డు అనే అద్భుత కవితలో
”మైలురాళ్ల రుమాళ్లతో మధ్యమధ్య ముఖం తుడుచుకుంటూ పరిగెత్తుతుంది రోడ్డు” అనడంలో కవిత్వం తళుక్కమని మెరిసిపోతుంది.
అపుడపుడు ఓ ఊరు ఎదురైతే చేతులూపుతుందంటాడు.
”చిమ్మచీకటైనా/ నక్షత్రాల టార్చిలైట్లు పట్టుకుని నడుస్తుంద”నడం కవితా చమత్కారం వ్యక్తమవుతుంది.
”విమానాలకు కూడా అసూయ/ ఎంతబాగుండేది/ తాము అలా నేల మీద గీతలా సాగిపోతే” అని.
ఎత్తు మీద ఉన్నవాళ్లకే కదా నిత్య ఆందోళనలని శిఖరాయమానంగా సాగే వస్తువులు, వాహనాలు, వ్యక్తుల గురించి వివరం అందిస్తూనే రోడ్డు పడిపోదు, ముందుకు పడిపోవడం తప్పు అనడం సినారె గారికే చెల్లుతుంది. ఈ కవిత ఆద్యంతం చదివినంతసేపు మనల్ని ఆనంద పారవశ్యానికి గురిచేస్తుంది తప్పకుండా.
మట్టి సంతకం… కవితలో
”మట్టి కూడా మాట్లాడుతుంది/ చెట్టే దాని భాష/ పూలు/ నిశ్శబ్దంగా నినదించే పరిమళ స్వరకోశాలు”. ఈ వాక్యాలు సామాన్యుడిని సైతం వహ్వా అనిపిస్తుంది.
ఈనాటి సమాజానికి, మనుషుల నైజాలకు ప్రతిబింబం మరో కవిత ‘వాతావరణం’ .
”ఒకరి పలకరింపు మరొకరికి జలదరింపు/ ఒకరి కరచాలనం మరొకరికి ఖడ్గఖేలనం”.
”పూసుకున్న చిరునవ్వు జరీపూత/ పూర్తిగా పెదవికి అంటుకోదు/ గుండెపెట్టే గావుకేక” గొంతుదాటి రాదనడం నేటి సంఘానికి అన్వయమైన నూటికి నూరు పాళ్లు వాస్తవభావమే. ”కృత్రిమ శ్వాసలతో దొర్లుతున్న వ్యవస్థా శరీరంలో/ సహజ స్వచ్ఛవాయూవు సంచారమెపుడో” అని సినారె ఆవేదన అక్షరాల సత్యం. ఈ కృతకవేషభాషల ముసుగుల్ని తొలగించుకుని ముందుకెళ్లడం ఇప్పుడెంతో అవసరం కూడాను.
చిత్రణ శీర్షిక కవితలో…
”ఉన్మాదం సీసాలో దింపి బిరడాబింగించిన
మూడుతలల భూతం కాదు జీవితం.
అగాధస్వప్నంసాచే లోయలబాహువుల్లో
అర్థరహితంగా మూల్గే ఆలాపన కాదు జీవితం” అంటూ నూరేళ్ల జీవితాన్ని ఇలా అభివ్యక్తం చేస్తాడు.
”రెండు తీరాలనూ నీటికౌగిట్లో పొదుగుకుని
దివారాత్రాలు సాగించే ప్రయాణం జీవితం.
చలికోస్తున్నప్పుడు అలల దుప్పట్లు కప్పుకుని
ఎండకాస్తున్నప్పుడు నురుగులగొడగులు పట్టుకుని
లయలా పయనించే ప్రవాహాన్ని చిత్రించు
అదే జీవితం అయిపోతుంది అక్షరాలా”.
మనిషి ఈ లోకంలో ఎలా మసలుకోవాలో, జీవితంలో ఎదురయ్యే అటుపోట్లను ఎదుర్కొని ఏవిధంగా మనుగడ సాగించాలో గురువులా ఉపదేశించడం ఆనందదాయకం, అభినందనీయం. శ్రీశ్రీ మానవుడే నా సందేశం. మనుష్యుడే నా సంగీతమంటే సినారె ప్రగతిశీల మానవత్వం అన్నాడు.
నిజానికిది పరిణతి సాధించిన మానవుడి దృక్పథం.
మనిషిని ప్రేమించి దీవించాలని ఉవ్విళ్లూరిన మహానుభావుడు సినారె దృక్పథం. ఇది మనమంతా చదువ వలసిన సినారె సమున్నత కావ్యం.
రమేశ్‌ నల్లగొండ 8309452179