ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

– ఆర్మూర్ ఏసిపి జగదీశ్ చందర్
– అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను సందర్శించిన ఏసిపి
నవతెలంగాణ- కమ్మర్ పల్లి :
శాసనసభ ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని క్షుణంగా  తనిఖీ చేయాలని ఆర్మూర్ ఏసిపి జగదీశ్ చందర్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన నిజామాబాద్  – జగిత్యాల్ జిల్లాల అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను ఏసీబీ జగదీశ్ చందర్ సందర్శించి తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డ నేపథ్యంలో ఆయన చెక్ పోస్ట్ ను సందర్శించారు. ఇరువైపులా చెక్ పోస్ట్ ను దాటే  ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలన్నారు. వాహనాల్లో రూ.50 వేలకు మించి నగదును తరలించే వారి వద్ద నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎలాంటి  అవసరాల కోరకైనా వాహనాల్లో ప్రయాణించే వారు  పెద్ద మొత్తంలో నగదు వెంట తీసుకు వెళ్ళొద్దని సూచించారు.వాహనాల తనిఖీల సందర్భంగా ఎలాంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వద్దని సిబ్బందికి సూచించారు. వాహన తనిఖీ జరగకుండా ఏ వాహనం కూడా చెక్ పోస్ట్ దాటవద్దని సిబ్బందికి ఆదేశించారు.
 ఈ సందర్భంగా ఏసీపీ స్వయంగా పలు వాహనాలను తనిఖీ చేశారు.