– మళ్లీ అధికారంలోకి వస్తే వాటికి చావు తప్పదు : తెలంగాణ కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగితేనే రాష్ట్రంలో బడ్జెట్ విద్యాసంస్థలకు మనుగడ ఉంటుందని పలువురు వక్తలు తెలిపారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఆ సంస్థల చావు తప్పదని హెచ్చరించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీష్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ విద్యావ్యవస్థ నిర్మాణమా? విధ్వంసమా ?’అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, టీఎల్ఎప్ గౌరవ అధ్యక్షులు కత్తి వెంకటస్వామి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటి దాడి విద్యావ్యవస్థపైనే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదండరామ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేందుకు రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందనీ, అందువల్ల మరింత సాహసంగా ముందుకెళ్లాలని సూచించారు. 1990ల్లో పెరిగిన నిరుద్యోగం నుంచి తప్పుకునేందుకు బడ్జెట్ విద్యాసంస్థలు ఉపయోగపడ్డాయనీ, లెక్చరర్లకు, టీచర్లకు ఉపాధినిచ్చాయని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ల తాకిడికి విలవిలలాడిన ఈ విద్యాసంస్థల ప్రతినిధులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారని వివరించారు. అయితే స్వరాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ సర్కార్ వేధింపులతో రాష్ట్రంలో దాదాపు 150 ఇంజినీరింగ్, 400 డిగ్రీ , వెయ్యి జూనియర్ కాలేజీలు మూతపడ్డాయని తెలిపారు. వీటిపైకి విజిలెన్స్, పోలీసులను ప్రయోగిస్తున్న సర్కార్ కార్పొరేట్లకు అండగా నిలబడిందని విమర్శించారు. పాపిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని కాలేజీలు మూతపడే ప్రమాదముందని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఆయా సంస్థల చావు తప్పదనుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా ఉన్న సమయంలో ఆయా కాలేజీలపై విజిలెన్స్ వేయాలని ఒత్తిడి తెచ్చినా తాను వ్యతిరేకించి నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యతాంశాల్లో విద్య, వైద్యం లేదంటూ, ఇదే విషయాన్ని చాలాసార్లు సమీక్షల్లో కూడా సీఎం చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మళ్లీ వచ్చి ఇవే విధానాలు కొనసాగితే 75 శాతం కాలేజీలు రెండు, మూడేండ్లలో మూతపడటం ఖాయమన్నారు. వాస్తవాల ఆధారంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ నాగయ్య, సీనియర్ కరస్పాండెంట్ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.