రాహుల్‌ జీ.. దేశానికే టీచింగ్‌ పాయింట్‌ తెలంగాణ

Rahul ji.. for the country Teaching Point Telangana– మంత్రి కేటీఆర్‌ ట్విట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం. .ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి” అని మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విట్‌ చేశారు. ‘దేశ సాగునీటి రంగ చరిత్రలోనే..అతి గొప్ప మానవ నిర్మిత ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని చూసి తరించండి. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లీస్తున్నామో అర్థం చేసుకోండి. నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే… ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటార్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి. మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి .కాంగ్రెస్‌ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్‌ఎస్‌ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి’ అంటూ ట్విటర్‌ వేదికగా రాహుల్‌కు సూచించారు.
ఎదురు దాడులకు కేరాఫ్‌ అడ్రస్‌ డ్రామారావు మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ కౌంటర్‌ ట్వీట్‌
బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. నిస్సిగ్గు మాటలకు, ఎదురుదాడులకు కేరాఫ్‌ అడ్రస్‌ డ్రామారావు అంటూ కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. 10 ఏండ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ- కేడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతరేసింది బీజేపీ, బీఆర్‌ఎస్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది కూడా ఆ రెండు పార్టీలేనని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని తమరే ఒప్పుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు కేసీఆర్‌ లాంటి దద్దమ్మ పాలన ఇక అవసరం లేదంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.