ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా…

– 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని నిరూపిస్తా…
– బీఆర్‌ఎస్‌ సవాల్‌ను స్వీకరించిన రేవంత్‌
– ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.15 వేల కోట్లు నొక్కేసిన దొంగలు కేసీఆర్‌, కేటీఆర్‌
– రైతు వేదికల వద్దే నిలదీయండి నిర్బంధించాలంటూ కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ ఇవ్వడం లేదంటూ నిరూపించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ రైతు వేదిక వద్దకు మంత్రి కేటీఆర్‌ వస్తారో చెబితే అక్కడకు వచ్చేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ ను సరఫరా చేయడం లేదని నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేవలం 24 గంటల విద్యుత్‌ సరఫరా కోసం ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకంటూ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదనీ, కేవలం అవసరమున్నంత మేరకే ఇస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ రావు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభాకర్‌ రావు పారియారని ఎద్దేవా చేశారు. రైతువేదికల వద్ద విద్యుత్‌ సరఫరాపై చర్చించాలన్న బీఆర్‌ఎస్‌ పిలుపును స్వాగతించారు. ఈ రకంగానైనా, ఇన్నాళ్లకు రాష్ట్రంలో పాలన, అవినీతి తదితర అంశాలపై చర్చించే అవకాశం దొరికిందన్నారు. ఇవే వేదికల వద్దకు వచ్చే బీఆర్‌ఎస్‌ నాయకులను నిలదీయాలనీ, నిర్బంధించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు ఆయనపిలుపునిచ్చారు.
త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నామనీ, 24 గంటల విద్యుత్‌ను సింగిల్‌ ఫేజ్‌గా ఇస్తున్నామంటూ ట్రాన్స్‌ కో సీఎండీ, అధికారులు చెబుతున్నారని తెలిపారు. తమ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్‌ స్టేషన్‌లో లాగ్‌బుక్‌ల ద్వారా విద్యుత్‌ సరఫరా బండారాన్ని బయటపెట్టారని తెలిపారు. ఆ దెబ్బకు రాష్ట్రంలోని అన్ని సబ్‌స్టేషన్ల నుంచి లాగ్‌బుక్‌లను సీజ్‌ చేశారని చెప్పారు. ఎనిమిది గంటల నుంచి 10 గంటలలోపే కరెంటును సరఫరా చేస్తు న్నట్టు అధికారులు చెబుతున్నారని వెల్లడించారు.
‘నిరంతర సరఫరా కోసం విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామనీ, అందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఎక్కువ గంటలు సరఫరా చేస్తున్నట్టు చూపించి కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటున్నది. కేంద్రంలో గత కాంగ్రెస్‌ పాలనలో దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. దీంతో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్‌ను అమ్మేందుకు ముందుకొచ్చింది. అయినా కేసీఆర్‌ సర్కార్‌ కొనుగోలు చేయలేదు. కేటీపీఎస్‌ 2015లో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5,280 కోట్లకు టెండర్‌ పిలించింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం 2,400 మెటావాట్ల థర్మల్‌ పవర్‌ ఉత్పత్తికి రూ.14 వేల కోట్లకు టెండర్‌ పిలిచింది. ఒక్క మెగావాట్‌ను రూ.5.50 కోట్లకు ఉత్పత్తి చేయొచ్చని బీహెచ్‌ఈఎల్‌ టెండరు దక్కించుకుంది. ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ఉత్పత్తికి రూ.10,997 కోట్లకు టెండరు పిలిచింది. అంటే రూ.6.80 కోట్లకే ఒక ఒక మెగావాట్‌ ఉత్పత్తి చేసేలా టెండరు వేసింది….’ అని రేవంత్‌ వెల్లడించారు.
సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ద్వారానే థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం 2011-12లో చట్టం తెచ్చిందని రేవంత్‌ గుర్తుచేశారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కాలుష్యం పెరిగి పోతున్నదనీ, బొగ్గు వినియోగం ఎక్కువు తుందని ప్రపంచం తిరస్కరించిందని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ గుజరాత్‌ ఇండియా బుల్స్‌ వద్ద రూ.1,000 కోట్లు లంచం తీసుకుని ఆ టెక్నాలజీని తెచ్చారని ఆరోపించారు. దీన్ని దీన్ని 7,290 కోట్లకు బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. అయితే ఇందులో బీహెచ్‌ఇఎల్‌ కేవలం ఎలక్ట్రో మిషన్లను మాత్రం తయారు చేయగా, మిగిలిన నిర్మాణ తదితర పనులను ప్రయివేటుకు అప్పగించారని తెలిపారు. పైకి ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఇఎల్‌కు ఇస్తున్నట్టుగా చూపిస్తూ, పరోక్షంగా తమ అనుయాయులకే పనులను అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ ప్రాజెక్టు టెండరు విలువను పెంచి… ఒక మెగావాట్‌ను ఉత్పత్తి చేసేందుకు రూ.9.70 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మొత్తంగా కేసీఆర్‌ కేటీపీఎస్‌లో రూ.945 కోట్లు, భద్రాద్రిలో రూ.4,538 కోట్లు, యాదాద్రిలో రూ.9,384 కోట్లు అంటే రూ.14 వేల కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌ తెలిపారు. అంటే 30 శాతం కమిషన్‌ నొక్కిన దొంగ కేసీఆరే అని తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఆ భారం రకరకాల ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని చెప్పారు.
కేటీఆర్‌ను అడ్డుకోండి….
కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఏది కావాలంటే అది తెచ్చుకోగల సమర్థుడైన రాహుల్‌ గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. ప్రజల కోసం భారత్‌ జోడో యాత్రతో మంచుకొండల్లో, మండుటెండల్లో తిరిగిన ఆయన్ను విమ ర్శించే స్థాయి పగలు, రాత్రికి తేడా తెలి యని కేటీఆర్‌ కు లేదని విమర్శిం చారు. దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప ఆయనకు ఏమి తెలియదని ఎద్దేవా చేశారు.
నిజంగా బంగారు తెలంగాణ అయితే….
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చామని చెబుతున్న సీఎం కేసీఆర్‌ అదే నిజమైతే తాను గజ్వేల్‌ నుంచి పోటీ చేసి… సిట్టింగ్‌ లందరికీ సీట్లు ఇవ్వాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. గజ్వేల్‌ నుంచి పోటీ చేయకుండా కేసీఆర్‌ ఎందుకు పారిపోతు న్నారని ప్రశ్నించారు. సిట్టింగ్‌లందరికి సీట్లిచ్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.

Spread the love