సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) చంద్రయాన్-3, ఆదిత్య -1 ప్రయోగ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో సరికొత్త ప్రయోగానికి నాంది పలుకుతుంది. భవిష్యత్‌లో జరిగే మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం జరిపే పరిశోధనల్లో భాగంగా మానవరహిత కృమాడ్యులును ప్రయోగించనుంది. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి టెస్ట్ వెహికల్ – డి1 రాకెట్ ద్వారా కృమాడ్యూల్‌ను ప్రయోగించనున్నారు. 17 కిలోమీటర్లు ఎత్తు వరకు వెళ్లి అక్కడ నుంచి ప్యారాచూట్ల సహాయంతో శ్రీహరికోటకు సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో 4520 కిలోల బరువు కలిగిన కృమాడ్యూల్ బంగాళాఖాతంలో పడనుంది. నేవీ వారి సహాయంతో తిరిగి మాడ్యూల్‌ను వెనక్కు తీసుకురానున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి మాడ్యూళ్లలో మనుషులను పైకి పంపడం జరుగుతుంది. అవి తిరిగి సురక్షితంగా భూమి మీదకు చేరుకునేలా పరీక్షల నిమిత్తం ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పర్యటనలు సులభతరం కానున్నాయి.