– ఎట్టికైనా.. మట్టికైనా మనోడే కావాలి.. : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
– బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న రావుల, జిట్టా, మామిళ్ల రాజేందర్
– రేపో మాపో కారెక్కనున్న చెరుకు సుధాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇతర పార్టీలకు ఓట్లేయటం ద్వారా తెలంగాణను ఈనగాచి నక్కల పాల్జేయొద్దంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆర్తి…ప్రధాని మోడీకో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకో ఉండబోదని అన్నారు. ‘ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలి…’ అంటూ వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, భువనగిరి జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో నేత మామిళ్ల రాజేందర్… మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… గతంలో సోనియాను బలి దేవతంటూ విమర్శించిన రేవంత్… ఇప్పుడు ఆమెను పొడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు అమరులు కావటానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. టీఆర్‌ఎస్సే లేకుంటే టీపీసీసీ, తెలంగాణ బీజేపీ ఉండేవా..? అని ప్రశ్నించారు. బీసీ జనగణన చేయాలంటూ కోరితే ప్రధాని మోడీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్‌ఎస్ గెలిస్తే… సీఎం కేసీఆర్‌తో తమకు ఇబ్బందులు తప్పవనే భయం కాంగ్రెస్, బీజేపీకి పట్టుకుందని అన్నారు. అందుకే ఎన్నికల్లో తమ పార్టీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పోలిస్తే ముదిరాజ్‌లను అక్కున చేర్చుకున్నది, ఆదుకున్నది బీఆర్‌ఎస్సేనని చెప్పారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులుంటారు.. కానీ ఆ పార్టీకి ఓట్లేయటానికి ఓటర్లే లేరంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత చెరుకు సుధాకర్ కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరనున్నారు.