రెట్టింపైన సెంట్రల్‌ బ్యాంక్‌ లాభాలు

Double central bank profitsన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగం లోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 90 శాతం వృద్థితో రూ.605.4 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.318.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. ప్రధాన ఆదాయాలు పెరగడానికి తోడు మొండి బాకీలు తగ్గడంతో ఆకర్షణీయ ఫలితాలు వచ్చాయని ఆ బ్యాంక్‌ తెలిపింది. 2022-23 క్యూ2లో 9.67 శాతంగా ఉన్న జిఎన్‌పిఎ గడిచిన త్రైమాసికంలో 4.62 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పిఎలు 2.95 శాతం నుంచి 1.64 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం క్యూ2లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం 11.51 శాతం పెరిగి రూ.6,02,284 కోట్లకు చేరింది. రిటైల్‌, వ్యవసాయ, ఎంఎస్‌ఎంఇ రుణాల జారీలో 14.24 శాతం వృద్థి చోటు చేసుకుంది. ప్రతీ ఉద్యోగి సగటు వ్యాపారం రూ.18.60 కోట్లకు చేరింది. 2022-23 ఇదే క్యూ2లో రూ.17.13 కోట్లుగా ఉంది.