బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మొబైల్‌ యాప్‌ కుంభకోణం

Bank of Baroda mobile app scam– రిజిస్టర్‌ కాని నెంబర్లకు బ్యాంక్‌ ఖాతాల అనుసంధానం
–  కొందరు ఉద్యోగుల సస్పెన్షన్‌
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) యాప్‌లో చోటుచేసుకున్న కుంభ కోణం బ్యాంకింగ్‌ వ్యవస్థ మూలాలనే కుదిపేస్తోంది. బ్యాంక్‌ నూతన వినియోగదారులకు ఈ మొబైల్‌ యాప్‌ సదుపాయం కల్పించకుండా రిజర్వ్‌బ్యాంక్‌ నిషేధం విధించింది. రిజిస్టర్‌ కాని మొబైల్‌ నెంబర్లకు బ్యాంక్‌ ఖాతాలను బీఓబీ అనుసంధానించిందంటూ ఓ వార్తా సంస్థ బయటపెట్టిన మూడు నెలలకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో వినియోగదారులకు కల్పించిన యాప్‌ సదుపాయాన్ని బ్యాంక్‌ ఉపసంహరించు కుంది. అయితే అప్పటికే డౌన్‌లోడ్లు, సైన్‌-అప్‌ల సంఖ్య కృత్రిమంగా పెరిగిపోయింది.
‘బీఓబీ వరల్డ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కోవాలని నూతన వినియోగదారులు భావిస్తే ముందుగా బ్యాంకులు జరిగిన లోపాలను గుర్తించి సరిచేసి, సంబంధిత ప్రక్రియలను పటిష్టవంతం చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐని సంతృప్తి పరచే విధంగా బ్యాంక్‌ ఈ చర్యలు చేపట్టాలి.
గత వారం ఆర్‌బీఐ చర్యలు తీసుకున్న తర్వాత బ్యాంక్‌ అధికారులు కొందరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. భోపాల్‌, బరోడా, రాజస్థాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్‌ చేసి విచారణ ప్రారంభిం చామని ఈ ప్రక్రియతో సంబంధమున్న ఓ అధికారి తెలిపారు. మొబైల్‌ యాప్‌లు ఉన్న బ్యాంకుల్లో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (ఐఎస్‌) ఆడిట్‌ వ్యవస్థను అమలు చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ను ఓ పౌర సమాజ వేదిక కోరింది. ఈ వ్యవస్థ ను అమలు చేయడం ద్వారా అవకతవకలు ఏమైనా జరిగాయా అనే విషయాన్ని కనిపెట్టాల్సిందిగా బ్యాంకులను కోరాలని సూచించింది.
‘అనేక బ్యాంకులు బిజినెస్‌ కరస్పాండెంట్లు, ఉద్యోగుల ద్వారా కస్టమర్లకు మొబైల్‌ యాప్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీంతో మోసగాళ్ల వలలో పడి వినియోగదారులు తమ సొమ్మును పోగొట్టుకుంటున్నారు. బ్యాంకులు తమ బిజినెస్‌ కరస్పాండెంట్లకు అసాధ్యమైన లక్ష్యాలు నిర్దేశిస్తుం టాయి. ఉద్యోగులు ఆ లక్ష్యాలను సాధించారా లేదా అనే విషయం పైనే బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి తప్ప మోసాలను గుర్తించడం లేదు’ అని ఈ నెల 14న ఆర్‌బీఐకి రాసిన లేఖలో బ్యాంక్‌ బచావో దేశ్‌ బచావో మంచ్‌ సంస్థ వివరించింది. బీఓబీ వరల్డ్‌ యాప్‌లో జరిగిన కుంభకోణం ప్రారంభం మాత్రమే నని, వాస్తవ కుంభకోణం భారీ స్థాయిలోనే ఉండ వచ్చునని తెలిపింది.