– ప్రపంచంలో ప్రతి యుద్ధం వెనుకా సామ్రాజ్యవాదమే
– ముంబయిలో ఏఐకేఎస్ నేతలతో భేటీ
– పాలస్తీనా ప్రజలపై దశాబ్దాలుగా క్రూరత్వం : యూకె లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇజ్రాయిల్ వెనుక అమెరికా సామ్రాజ్యవాదం ఉందని, ప్రపంచంలో జరుగుతున్న అనేక ఇతర యుద్ధాల వెనుక కూడా అమెరికా పాత్ర స్పష్టంగా ఉందని యుకె పార్లమెంటు ఎంపీ, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ అన్నారు. పాలస్తీనా ప్రజలపై దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయిల్ క్రూరత్వాన్ని ఆయన ఖండించారు. ముంబాయి పర్యటనలో ఉన్న జెరెమీ కార్బిన్‌తో శనివారం ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ (పిఐ)కి చెందిన వర్ష జిఎన్ పరిచయ వ్యాఖ్యలతో సమావేశం ప్రారంభమైంది. అక్కడ ఆమె పిఐ కృషిని, శాంతి, న్యాయం కోసం జెరెమీ పోషించిన పాత్రను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా శ్రామికవర్గం కోసం పిఐ చేపట్టిన పని, అమెజాన్ కార్మికులు మొదలైన వాటిని సంఘటితం చేయడం, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ప్రతిఘటన గురించి ప్రస్తావించారు.జెరెమీ కార్బిన్ యుకెలోని రాజకీయ సమస్యలు, కార్పొరేట్లు, వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గ పోరాటం, మితవాద ప్రపంచ పెరుగుదల, భారతదేశ రైతుల ఉద్యమానికి మద్దతుగా యుకె పార్లమెంట్‌లో చర్చ మొదలైన వాటి గురించి మాట్లాడారు. పాలస్తీనా ప్రజలపై దశాబ్దాలుగా ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరత్వాన్ని ఆయన ఖండించారు ఇజ్రాయిల్ వెనుక అమెరికా సామ్రాజ్యవాదం ఉందని, ప్రపంచంలో జరుగుతున్న అనేక ఇతర యుద్ధాల వెనుక కూడా ఇది స్పష్టంగా కనపడుతుందని ఆయన అన్నారు. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా యుకెలోనూ మిగిలిన ప్రపంచంలోనూ ఇటీవల నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనల గురించి వివరించారు. ఆయన వెంటనే తిరిగి లండన్‌కు బయలుదేరి అక్కడ భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నానని తెలిపారు. పాలస్తీనా ప్రజలకు ప్రపంచ మద్దతును పెంచేందుకు 2,00,000 మంది ప్రజలతో ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. లాటిన్ అమెరికా, ఐరోపాలో వివిధ వామపక్ష ఉద్యమాలను ఆయన ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో తన చిరస్మరణీయ సమావేశాలను వివరిస్తూ ఆయన ఆనందించారు.
లాటిన్ అమెరికాలోని వివిధ ప్రగతిశీల ఉద్యమాలపై జెరెమీతో కలిసి శాంతి, న్యాయ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు లారా అల్వారెజ్ ప్రసంగించారు. ఆమె భారతదేశంలో తన అనుభవాల గురించి, ప్రగతిశీల, సామాజిక ఉద్యమాలు ప్రజాపక్షానికి నాయకత్వం వహించడం ఎలా కష్టతరంగా మారుతుందో తెలిపారు. మోడీ ప్రభుత్వం ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు, టెలికమ్యూనికేషన్ దిగ్బంధాలపై ఆమె తన వేదనను వ్యక్తం చేశారు. ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భారతదేశంలో వామపక్షాలు, అభ్యుదయవాదులు చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు.ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే జెరెమీ కార్బిన్ దృఢమైన సామ్రాజ్యవాద వ్యతిరేక, సామ్యవాద నిబద్ధతను అర్ధ శతాబ్దానికి పైగా నొక్కి చెప్పారని వివరించారు. ఇది ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా నిలిపిందన్నారు. ఆయన 1983 నుండి గత 40 సంవత్సరాలుగా బ్రిటిష్ పార్లమెంటుకు నిరంతరం ఎన్నికయ్యారన్నారు. 2015 నుండి 2019 వరకు అతను లేబర్ పార్టీ నాయకుడిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారని తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ భారతదేశానికి మిత్రుడని, చారిత్రాత్మక రైతుల పోరాటానికి గట్టిగా మద్దతు ఇచ్చారని తెలిపారు. అశోక్ ధావలే వచ్చే ఏడాది భారతదేశంలో, యుకె రెండు దేశాల్లో సాధారణ ఎన్నికలలో ప్రజాస్వామ్య రాజకీయ మార్పును సాధించడానికి అన్ని ప్రయత్నాలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశమంతటా భారీ ప్రదర్శనలతో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
వామపక్షాల తరపున సీపీఐ ప్రకాష్ రెడ్డి జెరెమీ కార్బిన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించగా, ప్రముఖ సినీ నిర్మాత ఆనంద్ పట్వర్ధన్ లారా అల్వారెజ్‌ను, ప్రజా మేధావి సంజీవ్ చందోర్కర్ వర్ష జిఎన్‌ను అభినందించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉదరు నార్కర్‌ను జెరెమీకి నెహ్రూ జాకెట్‌ను బహుకరించారు. దానిని ఆయన అక్కడే వేసుకున్నారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే లారా అల్వారెజ్‌కు శాలువా కప్పి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వివేక్ మోంటెరోలు జెరెమీ, లారాలకు జ్ఞాపికలను అందజేశారు. చివరగా డాక్టర్ అశోక్ ధావలే భారతదేశం, మహారాష్ట్రలో రైతుల పోరాటాలపై మూడు పుస్తకాలను జెరెమీకి అందించారు.అనంతరం సభకు హాజరైన వారి ప్రశ్నలకు జెరెమీ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. ఈ సమావేశ విశాల స్వభావాన్ని ప్రశంసించారు. మహారాష్ట్రలోని దాదాపు 35 మంది వామపక్ష నేతలు, ప్రగతిశీల మేధావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిలో ట్రేడ్ యూనియన్, బ్యాంక్ యూనియన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పాత్రికేయులు, ప్రగతిశీల మేధావులు, సాంస్కృతిక కార్యకర్తలు, మహిళా సంఘాల, విద్యార్థి నాయకులు, మహారాష్ట్రలోని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) నాయకులు పాల్గొన్నారు.