నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన ఏపీ సీఎం జగన్‌

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏపీ సీఎం జగన్‌ తనను నమ్మిన ప్రజలను నట్టేట ముంచారనీ, వైకాపా పాలన అవినీతిమయమైందని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, గంజాయి మాఫియా పెట్రేగిపోతున్నదనీ, వైకాపా నాయకుల ప్రోద్బలంతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమౌతున్నదని తెలిపారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో గంజాయి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విలసిల్లుతోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనన్ని మద్యం బ్రాండ్లు ఏపీలో దొరుకుతాయన్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఖజానా నింపుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. తొలుత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎపి నాయుడు ఆధ్వర్యంలో డి.సైదావలి, పలు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తోట సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు.